అరెస్టులతో పోరాటాన్ని అణచివేయలేరు
చందుర్తి,(విజయక్రాంతి): అరెస్టులతో సర్పంచుల పోరాటాన్ని అణచివేయలేరని మాజీసర్పంచ్ దుమ్మ అంజయ్ అన్నారు. ముఖ్యమంత్రి నివాసం ముట్టడికి పిలుపునిచ్చారనే ముందస్తు సమాచారంతో చందుర్తి మండలం రామన్నపేట గ్రామ మాజీ సర్పంచ్ దుమ్మ అంజయ్యను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. అనంతరం ఆయనను స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా పోలీసుల అరెస్టులపై అంజయ్య అభ్యంతరం వ్యక్తం చేశారు.
పోలీస్ స్టేషన్ నుండి ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యబద్ధంగా తమ సమస్యలపై నిరసన తెలిపే హక్కును ప్రభుత్వం నియంత్రిస్తోందని విమర్శించారు. మాజీ సర్పంచుల న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాల్సింది పోయి అరెస్టులకు పాల్పడటం సరికాదన్నారు. ఇటువంటి చర్యలతో సర్పంచుల పోరాటాలను అణచివేయలేరని సర్పంచుల జేఏసీ తరపున ఈ అరెస్టులను ఖండిస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వం తక్షణమే మాజి సర్పంచుల సమస్యలను పరిష్కరించాలని, లేనిపక్షంలో తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు.






