ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక నిధులు పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు
రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య
మహబూబాబాద్, ఆగస్టు 20 (విజయక్రాంతి): ఎస్సీ,ఎస్టీల సంక్షేమం కోసం ప్రభుత్వాలు కేటాయిస్తున్న నిధులను పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, ఎస్సీ ఎస్టీ యువత కోసం ప్రభుత్వం కల్పిస్తున్న పథకాల ద్వారా శిక్షణ పొంది ఉపాధి పొందేలా చూడాలని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు.
గురువారం మహబూబాబాద్ ప్రభుత్వ గిరిజన డిగ్రీ కళాశాల ను సందర్శించారు అనంతరం ఐడిఓసిలో ఎస్సి, ఎస్టీలకు సంబంధించిన భూ సమస్యలు, ఆర్ ఓ ఆర్, ఉద్యోగుల పదోన్నతులు, ఉప ప్రణాళిక నిధులు వినియోగం, సంక్షేమం, హక్కుల పరిరక్షణ, ప్రభుత్వ పథకాల అమలు, ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద నమోదైన కేసుల పురోగతి తదితర అంశాలపై, ఎస్పీ డాక్టర్ శబరిష్, రెవెన్యు అదనపు కలెక్టర్ కె.అనిల్ కుమార్, స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ పురుషోత్తం తో కలిసి వివిధ శాఖల అధికారులతో కమిషన్ ఛైర్మన్, సభ్యులు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ బక్కి వెంకటయ్య మాట్లాడుతూ మంజూరైన నిధులను ఎస్సి,
ఎస్టీ ఆవాసాలకు ఖర్చు చేయకపోతే ఆయా శాఖల అధికారులదే భాద్యత ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగం కల్పించిన హక్కులు, రక్షణలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీల హక్కుల పరిరక్షణ, సంక్షేమం, అభివృద్ధి కోసం అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలన్నారు. ప్రజల సమస్యలను కేవలం కార్యాలయాలకే పరిమితం చేయకుండా క్షేత్రస్థాయిలో పర్యటించి పరిష్కరించాలన్నారు.
ఎస్సీ, ఎస్టీలపై జరిగే అఘాయిత్యాలకు సంబంధించిన కేసుల విషయంలో పోలీసులు, రెవెన్యూ తదితర శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఛైర్మన్ సూచించారు. ఈ సమావేశంలో రాష్ట్ర కమిషన్ సభ్యులు కుసురం నీలాదేవి, రాంబాబు నాయక్, కొంకటి లక్ష్మి నారాయణ, జెల్ల శంకర్ ఎస్.సి డెవలప్మెంట్ అధికారి శ్రీనివాస రావు, ఎస్టీ సంక్షేమ శాఖ అధికారి దేశీ రామ్ నాయక్, జిల్లా రెవెన్యూ అధికారిని నాగలక్ష్మి, మహబూబాబాద్ తొర్రూరు ఆర్డీవోలు రాజేశ్వరి, గణేష్, జిల్లా సభ్యులు గూగులోత్ కిషన్ నాయక్, పంజాలా కల్పన, రజినీకుమార్, పుష్పలత, అన్ని శాఖల జిల్లా అధికారులు, అన్ని మండలాల తహశీల్దార్లు, ఎంపిడివోలు, మున్సిపల్ కమిషనర్లు, వివిధ శాఖల జిల్లా అధికారులు, కుల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.






