16 May, 2026 | 5:05 PM

సిబ్బంది భద్రతకు మరింత పటిష్ట చర్యలు

16-05-2026 04:20 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల సర్కిల్   పరిధిలో  విధులు నిర్వహించే సిబ్బంది భద్రతకు అత్యున్నత ప్రాధాన్యతనిస్తూ వన్ మినిట్ రూల్” పేరుతో ప్రత్యేక భద్రతా విధానాన్ని అమలు చేస్తున్నట్లు సూపెరింటెండింగ్ ఇంజనీర్ జాదవ్ సుభాష్ తెలిపారు. క్షేత్ర స్థాయిలో పనులు ప్రారంభించే ముందు ప్రతి ఉద్యోగి కేవలం ఒక నిమిషం సమయం తీసుకుని భద్రతా ప్రమాణాలను సమగ్రంగా పరిశీలించడం ఈ విధానంలోని ప్రధాన ఉద్దేశమని తెలిపారు. 

ఈ ప్రత్యేక భద్రతా విధానం ద్వారా విద్యుత్ ప్రమాదాలను గణనీయంగా తగ్గించడం, సిబ్బంది ప్రాణాలను రక్షించడం, విద్యుత్ సరఫరా వ్యవస్థను మరింత సురక్షితంగా నిర్వహించడం లక్ష్యంగా పెట్టుకొని సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి ఈ కొత్త ఆలోచన విధానాన్ని తీసుకువచ్చారని తెలిపారు.  వన్  మినిట్ రూల్  తీసుకురావడంలో  సిబ్బంది  హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. చిన్నపాటి నిర్లక్ష్యం కూడా ప్రాణాంతక ప్రమాదాలకు దారి తీసే అవకాశం ఉన్నందున, ఈ “ఒక్క నిమిషం జాగ్రత్త” సిబ్బంది ప్రాణాలను కాపాడగలదని ఆయన పేర్కొన్నారు.

“ వన్ మినిట్ రూల్”లో భాగంగా తప్పనిసరిగా పరిశీలించాల్సిన అంశాలు

లైన్ క్లియర్ (LC) పొందిన విషయాన్ని నిర్ధారించుకోవడం

ఇండక్షన్ టెస్టర్‌తో లైన్‌లో విద్యుత్ సరఫరా లేదని పరీక్షించడం

వ్యక్తిగత రక్షణ పరికరాలు (PPE) సరిగా ధరించడం

ఎర్తింగ్ వ్యవస్థ సక్రమంగా ఏర్పాటు చేయడం

పని ప్రదేశంలో ఇతర ప్రమాదాల అవకాశాలు ఉన్నాయా అన్నది పరిశీలించడం

డబుల్ ఫీడింగ్ జరగకుండా భద్రతా చర్యలు తీసుకోవడం

టీమ్ సభ్యులందరూ అప్రమత్తంగా ఉన్నారో లేదో నిర్ధారించుకోవడం

పనికి ఉపయోగించే పరికరాలు సురక్షిత స్థితిలో ఉన్నాయో లేదో పరిశీలించడం

భద్రతే మొదటి ప్రాధాన్యత

టీజీఎన్పీడీసీఎల్‌లో ప్రతి ఉద్యోగి “వన్ మినిట్ రూల్”ను తప్పనిసరిగా పాటించేలా విస్తృత అవగాహన కార్యక్రమాలు, భద్రతా శిక్షణలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. భద్రతా నియమాలను కచ్చితంగా అమలు చేస్తే విద్యుత్ ప్రమాదాలను సమర్థవంతంగా నివారించవచ్చని ఆయన అన్నారు.

“ఒక్క నిమిషం ఆలోచన – జీవితాంతం భద్రత”

అనే సందేశంతో “వన్ మినిట్ రూల్”ను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని చెప్పారు.