చిట్‌ఫండ్ పేరుతో రూ.2 కోట్ల టోకరా
దంపతుల పరార్
బడంగ్‌పేట్, మే 3 (విజయక్రాంతి): నమ్మిన వారినే నట్టేట ముంచిన ఘటన మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. చిట్‌ఫండ్‌ల పేరుతో అమాయక ప్రజల నుండి సుమారు రెండు కోట్ల రూపాయలు వసూలు చేసి, ఒక దంపతులు బోర్డు తిప్పేసిన ఉదంతం స్థానికంగా కలకలం రేపుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకా రం సురేష్ అనే వ్యక్తి తన భార్యతో కలిసి గత పదేళ్లుగా ‘వెంకటసాయి చిట్‌ఫండ్స్’ నిర్వహిస్తున్నారు.
సుదీర్ఘ కాలంగా వ్యాపా రం చేస్తుండటంతో స్థానికులు వారిని నమ్మి భారీగా పెట్టుబడులు పెట్టారు. సుమారు 25 మందికి పైగా బాధితులు ఒక్కొక్కరు రూ. 2.5 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు చిట్టీలు వేశారు.చిట్టీల గడువు ముగిసినా డబ్బులు తిరిగి ఇవ్వకుండా సురేష్ దంపతులు కాలయాపన చేస్తూ వచ్చారు. బాధితు లు ఒత్తిడి చేసిన ప్రతిసారీ చెక్కులు, ప్రామిసరీ నోట్లు ఇచ్చి నమ్మబలికారు.
అయితే, వారు ఇచ్చిన చెక్కులు బ్యాంకులో బౌన్స్ కావడంతో బాధితులు అప్రమత్తమయ్యారు. మోసపోయామని గ్రహించిన బాధితులు సురేష్ ఇంటి ఎదుట నిరసనకు దిగారు. పదే ళ్ల నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని తమ కష్టార్జితాన్ని కాజేశారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బాధితులు మీర్పేట్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. సుమా రు రూ. 2 కోట్ల మేర మోసం జరిగినట్లు ప్రాథమికంగా తేలింది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.






