6 August, 2026 | 2:49 AM

కీర్తి సురేశ్.. ఒక డోరతీ!

06-08-2026 12:05 AM

స్టార్ బ్యూటీ కీర్తి సురేశ్ వరుస సినిమాలతో అలరిస్తూ కెరీర్‌లో దూసుకెళుతోంది. ఇటీవల నాని ‘ది ప్యారడైజ్’ సినిమాలో ప్రత్యేక గీతంలో పాల్గొన్న అ ముద్దుగుమ్మ మరో ప్రతిష్టాత్మక చిత్రంతో ప్రేక్షకులను పలుకరించనుంది. కీర్తి సురేశ్ ప్రధాన పాత్రలో, ప్రముఖ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఆయన దర్శకత్వం వహిస్తున్న 10వ సినిమా ఇది.

తన కెరీర్‌లో మైలురాయిగా నిలిచే ఈ చిత్రానికి ‘డోరతీ’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ మూవీ టీజర్‌ను సైతం హీరో ధనుష్ చేతుల మీదుగా లాంఛ్ చేయించారు.  ఇది గుర్తింపు, కులం, పురుషాధిక్యత, మానవీయ కోణాల చుట్టూ తిరిగే ఒక భావోద్వేగ డ్రామా కావటంతో ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే ఈ చిత్రం ప్రతిష్టాత్మక ‘టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (టీఐఎఫ్‌ఎఫ్)లో ‘సెంటర్‌పీస్’ విభాగంలో ప్రదర్శనకు ఎంపికైంది.

జియో స్టూడియోస్, సిఖ్యా ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేశ్‌తోపాటు సనంత్, రిషికాంత్ కీలక పాత్రలు పోషిస్తుండగా,  ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. కీర్తి సురేశ్‌కు సౌత్ ఇండియా అంతటా క్రేజ్ ఉండటం, జియో స్టూడియోస్ వంటి పెద్ద నిర్మాణ సంస్థలు భాగస్వామ్యం కావడం వల్ల ఈ సినిమాను తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లోనూ విడుదల చేయనున్నారు. ఇదే ఏడాది సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం. 

‘డోరతీ’ అంటే..? : ‘డోరతీ’ అంటే ‘భగవంతుని కానుక’ లేదా ‘దేవుడిచ్చిన బహుమతి’ అని అర్థం. ఇది గ్రీకు భాషా పదం. హాలీవుడ్ క్లాసిక్ నవల, సినిమా అయిన ‘ది విజార్డ్ ఆఫ్ ఓజ్’లోని ప్రధాన పాత్ర పేరు ‘డోరతీ’ కావడంతో ఈ పేరు ప్రపంచవ్యాప్తంగా బాగా ప్రాచుర్యం పొందింది.