21 April, 2026 | 1:32 AM

ఉపాధ్యాయులు 8 మంది.. విద్యార్థులు 28..

21-04-2026 12:06 AM

విద్యావ్యవస్థ తీరు ఇలా..

తాడ్వాయి,ఏప్రిల్ 20 (విజయక్రాంతి): ప్రభుత్వం పేద విద్యార్థుల కోసం లక్షల రూపాయలు ఖర్చు చేస్తుంది. అందుకోసం ప్రభుత్వ పాఠశాలలో అన్ని సౌకర్యాలు కల్పించి విద్యాబోధన నిర్వహిస్తుంది. కానీ విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయడంలో నిర్లక్ష్యం వహిస్తుంది. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం ఎండ్రియాల్ గ్రామం లోని ఉన్నత పాఠశాలలో మొత్తం ఎనిమిది మంది ఉపాధ్యాయులు విద్యాబోధన నిర్వహిస్తున్నారు. ఇక్కడ విద్యార్థులు మాత్రం కేవలం 28 మంది మాత్రమే ఉన్నారు.

అంటే ఒక్కో ఉపాధ్యాయుడికి నలుగురు విద్యార్థులు సైతం రావడం లేదు. ఒక్కో ఉపాధ్యాయుడికి 3.5 శాతం విద్యార్థులు మాత్రమే ఉన్నారు. ప్రభుత్వం లక్షల రూపాయలు ఖర్చు చేసి పేద విద్యార్థులకు అందుబాటులో ఉండాలని సంకల్పిస్తే అందుకు భిన్నంగా పరిణామాలు ఉంటున్నాయి. అందరికీ అందుబాటులో విద్యా వ్యవస్థ ఉండాలనే లక్ష్యంతో ఉన్నత పాఠశాలలను ఏర్పాటు చేసింది.అందులో భాగంగానే ఏండ్రియాల్ గ్రామానికి సైతం ఉన్నత పాఠశాల మంజూరు అయింది.

కానీ విద్యాశాఖ అధికారులు అందుకు తగ్గట్టుగా విద్యార్థుల సంఖ్యను పెంచడం లేదు. ప్రతినెల 8 మంది ఉపాధ్యాయులకు లక్షల రూపాయలు ఖర్చవుతుంది. ప్రభుత్వం లక్షల రూపాయలు వేతనాలు చెల్లిస్తుంది. కానీ అందుకు తగ్గట్టుగా విద్యార్థుల సంఖ్యను పెంచడంలో అధికారులు విఫలమవుతున్నారు.గత సంవత్సరం ఈ సంఖ్య 12 మాత్రమే ఉందని ఉపాధ్యాయులు తెలుపుతున్నారు.ఈ సంవత్సరమే కాస్త 16 మంది సంఖ్యను పెంచగలిగామన్నారు. వచ్చే సంవత్సరం ఈ సంఖ్యను 40 నుంచి 50కి పెంచుతామని తెలిపారు.

ఇప్పటికైనా అధికారులు స్పందించి ఉన్నత పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచాలని స్థానికులు కోరుతున్నారు లేనియెడల లక్షల రూపాయలు వృధాగా పోతాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.జిల్లాలో ఇలాంటి ఇలాంటి పాఠశాలలు చాలా ఉన్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. అధికారులు స్పందించి విద్యావ్యవస్థను ప్రక్షాళన నిర్వహించాలని కోరుతున్నారు. ప్రతి సంవత్సరం పాఠశాలలో డైస్ ఫారాలు నింపిన పై అధికారులు ఈ విషయంపై ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ పాఠశాలలో ఆరవ తరగతిలో ఐదుగురు, ఏడవ తరగతిలో 9 మంది, 8వ తరగతిలో పదిమంది, 9 వ తరగతిలో ఒకరు,10వ తరగతిలో ముగ్గురు విద్యార్థులు మాత్రమే విద్యను అభ్యసిస్తున్నారు.