22 August, 2026 | 11:47 PM

అరవింద్ నగర్ కాలనీలో సమస్యల పరిష్కారానికి కృషి

22-08-2026 10:44 PM

- ఏఐసీసీ విచార్ విభాగ్ కో ఆర్డినేటర్ రాఘవేందర్ రెడ్డి హామీ

బడంగ్ పేట్,(విజయక్రాంతి): మహేశ్వరం నియోజకవర్గం జిహెచ్ఎంసి బడంగ్‌పేట్ సర్కిల్ నాదర్ గుల్ 57 డివిజన్ పరిధిలోని గుర్రంగూడ అరవింద్ నగర్ కాలనీలో నెలకొన్న మౌలిక వసతుల సమస్యలపై కాలనీ వాసుల కోరిక మేరకు.. శనివారం ఏఐసీసీ విచార్ విభాగ్ కోఆర్డినేటర్ బోయపల్లి రాఘవేందర్ రెడ్డి స్థానికులతో కలిసి పర్యటించారు. కాలనీలో దెబ్బతిన్న డ్రైనేజీ మ్యాన్‌హోల్స్, అస్తవ్యస్తంగా ఉన్న రోడ్ల దుస్థితి, వీధిదీపాల (కరెంట్ లైట్లు) కొరత వంటి సమస్యలను స్థానిక కాలనీ వాసులు రాఘవేందర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ప్రజల ఫిర్యాదులపై సానుకూలంగా స్పందించిన ఆయన, వెంటనే బడంగ్‌పేట్ సర్కిల్ ఏఈతో ఫోన్‌లో మాట్లాడారు.

డ్రైనేజీ మ్యాన్‌హోల్స్ సమస్యను పరిశీలించి, మరమ్మతులు చేపట్టేందుకు రెండు రోజుల్లో కాలనీని సందర్శించాలని కోరారు. అదే విధంగా, కాలనీలో వీధిదీపాలు ఏర్పాటు చేయడంతో పాటు రోడ్ల సమస్యను కూడా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే పూర్తిస్థాయిలో పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. రాఘవేందర్ రెడ్డి  విజ్ఞప్తిపై స్పందించిన ఏఈ, రెండు మూడు రోజుల్లో కాలనీని సందర్శించి మ్యాన్‌హోల్స్ మరమ్మతులు పనులు చేపడతామని, ఇతర సమస్యలను కూడా సంబంధిత శాఖల ద్వారా పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. తమ సమస్యలపై వెంటనే స్పందించి అధికారులతో మాట్లాడిన రాఘవేందర్ రెడ్డికి అరవింద్ నగర్ కాలనీ వాసులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.