పాఠశాలలో పారిశుద్ధ్యం, నాణ్యమైన భోజనంపై ప్రత్యేక దృష్టి
జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్
మెదక్, ఏప్రిల్ 20(విజయ క్రాంతి) : పాఠశాలలో పారిశుద్ధ్యం, నాణ్యమైన భోజనంపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ పేర్కొన్నారు. 99 రోజుల ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నేటి నుంచి సంక్షేమ వారోత్సవాల నేపథ్యంలో మొదటి రోజున సంక్షేమ పాఠశాలలు, వసతి గృహాల వంట గదులు, పరిసరాలు, పరిశుభ్రత, పారిశుద్ధ్య నిర్వహణ, ఆహార నాణ్యతపై అవగాహన కింద సోమవారం మెదక్ జిల్లా కేంద్రంలో గల మైనారిటీ బాలికల పాఠశాల, వసతి గృహమును మెదక్ మున్సిపల్ చైర్మన్ శ్రీమతి రాధిక భూపతి రాజు, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, సంబంధిత ఉపాధ్యాయునులతో కలిసి జిల్లా కలెక్టర్ సందర్శించి, ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు.
ఈ సందర్భంగా పాఠశాలలో మరుగుదొడ్లు , పారిశుద్ధ్యం మధ్యాహ్న భోజన పథకం అమలు విధానాన్ని కలెక్టర్ సమగ్రంగా తనిఖీ చేశారు. వంట విధానం, వంట తయారీ ప్రక్రియను పరిశీలించి, విద్యార్థులకు అందిస్తున్న భోజనం శుభ్రంగా, రుచికరంగా ఉండేలా చూసుకోవాలని సూచించారు. వంటకు ఉపయోగిస్తున్న పదార్థాల నాణ్యతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, సరుకులు నాణ్యతతో సరైన ప్రమాణాలతో ఉండాలని ఆదేశించారు.
పాఠశాల పరిసరాల్లో పారిశుద్ధ్యం పరిస్థితిని పర్యవేక్షించి, ఎప్పటికప్పుడు పరిశుభ్రత పాటించాలని తెలిపారు. అదే విధంగా, పాఠశాలలో చేపట్టిన మూత్రశాలలను పరిశీలించి, మరుగుదొడ్లకు డోర్ల మరమ్మత్తుల పనులు త్వరగా పూర్తి చేయాలని, నాణ్యతా ప్రమాణాలు పాటించాలన్నారు.
విద్యార్థులకు మెరుగైన వాతావరణం కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. అధికారులు, ఉపాధ్యాయులు సమన్వయంతో పని చేసి విద్యా ప్రమాణాలను పెంపొందించాలని సూచించారు. ఈ తనిఖీలో సంబంధిత ఉపాధ్యాయులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.






