12 April, 2026 | 2:03 AM

చదువుతోనే సామాజిక విముక్తి

12-04-2026 12:22 AM
  1. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న

టీఆర్పీ కార్యాలయంలో ఘనంగా ఫూలే జయంతి

హైదరాబాద్, ఏప్రిల్ 11(విజయక్రాంతి): మహాత్మ జ్యోతిబా ఫూలే 199వ జయంతి వేడుకలు తెలంగాణ రాజ్యాధికార పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఫూలే చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనం తరం మల్లన్న మాట్లాడుతూ భారతదేశంలో విద్యా విప్లవానికి నాంది పలికిన మహనీయుడు జ్యోతిబా ఫూలే అని కొనియాడారు.

కుల వివక్షకు వ్యతిరేకంగా, అణగారిన వర్గాల హక్కుల కోసం ఆయన చేసిన పోరాటం అజరామరమన్నారు. ముఖ్యంగా స్త్రీ విద్య కోసం ఫూలే దంపతులు పడిన శ్రమ నేటి సమాజానికి స్ఫూర్తిదాయకమన్నారు.‘చదువు లేకపోతే తెలివి నశిస్తుంది.. తెలివి లేకపోతే నీతి తప్పుతుంది’ అన్న ఫూలే సూక్తిని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని ఆయన కోరారు.

బహుజన బిడ్డలు విద్యావంతులై రాజ్యాధికారం దిశగా అడుగులు వేయడమే ఫూలేకు ఇచ్చే అసలైన నివాళి అని పిలుపునిచ్చారు. ఫూలే ఆశయాలను గ్రామగ్రామాన తీసుకెళ్లి, సామాజిక మార్పు కోసం తెలంగాణ రాజ్యాధికార పార్టీ నిరంతరం కృషి చేస్తుందని మల్లన్న స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.