గ్యాస్ సిలిండర్ల కొరత.. ఉదయం నుంచే పడిగాపులు
మొయినాబాద్,(విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా మొయినాబాద్(Moinabad) ప్రాంతంలో గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రంగా మారింది. సిలిండర్ కోసం స్థానికులు ఉదయం నుంచే గ్యాస్ ఏజెన్సీల(Gas Agencies) వద్ద బారులు తీరుతూ పడిగాపులు కాస్తున్న పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు ఎక్కువసేపు వేచి ఉండాల్సి రావడంతో అసౌకర్యానికి గురవుతున్నారు. స్థానికుల వివరాల ప్రకారం, ముందుగా బుక్ చేసిన సిలిండర్లు కూడా సమయానికి అందకపోవడంతో ప్రజలు నేరుగా ఏజెన్సీల వద్దకు వెళ్లి నిలబడాల్సి వస్తోంది. కొందరు వినియోగదారులు రెండు నుంచి మూడు రోజులుగా తిరుగుతున్నా సిలిండర్ అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా కూడా గ్యాస్ సరఫరాలో ఆలస్యాలు(Delays in Gas Supply) చోటుచేసుకుంటున్నాయి. కొన్నిచోట్ల సిలిండర్ బుకింగ్ చేసిన తర్వాత కూడా 10 రోజులు వరకు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని సమాచారం. ఈ పరిస్థితికి అంతర్జాతీయ స్థాయిలో ఎల్‌పీజీ(LPG Shortage) సరఫరా లోపాలు, డిమాండ్ పెరగడం ప్రధాన కారణాలుగా అధికారులు చెబుతున్నారు. స్థానికులు తక్షణ చర్యలు తీసుకుని సరఫరా పెంచాలని అధికారులను కోరుతున్నారు. గ్యాస్ కొరతను నియంత్రించేందుకు అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని, బ్లాక్ మార్కెట్‌ను అరికట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.




