10 April, 2026 | 3:02 AM

హోర్ముజ్‌లో నౌకలు వెనక్కి!

10-04-2026 01:18 AM
  1. జలసంధిని మళ్లీ మూసేసిన ఇరాన్
  2. సముద్రంలోనే 1000కి పైగా నౌకలు

టెహ్రాన్, ఏప్రిల్ 9: అమెరికా, ఇరాన్ మధ్య కాల్పుల విరమణ కుదిరాక కూడా లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులను కొనసాగిస్తుండటంతో గల్ఫ్‌లో మళ్లీ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. లెబనాన్‌పై దాడులకు నిరసనగా ఇరాన్ మళ్లీ హోర్ముజ్‌ను మూసివేసినట్టు ప్రకటించింది. ఈ నేపథ్యంలో సరకు రవాణా నౌకల రాకపోకలకు మళ్లీ అంతరాయం ఏర్పడినట్టు, హోర్ముజ్ వైపు ప్రయాణిస్తున్న అనేక సరకు రవాణా నౌకలు వెనక్కు మళ్లుతున్నట్టు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వెలువడుతున్నాయి.

కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత మారిటైమ్ ట్రాకింగ్ డేటా ప్రకారం.. గ్రీన్‌కు చెందిన బల్క్ క్యారియర్ ఎన్‌జే ఎర్త్, లైబీరియా జెండా కలిగిన డేటోనా బీచ్ అనే రెండు నౌకలు హోర్ముజ్‌ను దాటాయి. ఈ క్రమంలో అరోరా అనే చమురు నౌక కూడా జలసంధిని దాటేందుకు సిద్ధమైంది. అయితే అప్పటికే లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తుండడంతో ఇరాన్ హోర్ముజ్‌ను పూర్తిగా మూసేసింది.

దీంతో జలసంధిని దాటేందుకు తొలుతు ముందుకెళ్లిన ఈ నౌక ముసందం తీరం వద్ద వెనక్కు మళ్లింది. దీంతోపాటు మరికొన్ని నౌకలు కూడా ఇలానే వెనుదిరిగినట్లు అంతర్జాతీయ మీడియా తెలిపింది. ఇప్పటికే చైనాకు చెందిన కొన్ని సరకు రవాణా నౌకలు హోర్ముజ్‌ను దాటేందుకు వేచి చూస్తున్నట్టు కూడా మీడియాలో కథనాలు వెలువడ్డాయి. చైనా ప్రభుత్వ షిప్పింగ్ సంస్థ కాస్కోతో పాటు మరో సంస్థ హీ రాంగ్ హాయ్‌కు చెందిన నౌకలు హోర్ముజ్ జలసంధికి కొద్ది దూరంలో పర్షియన్ గల్ఫ్ జలాల్లో వేచి చూస్తున్నట్టు సమాచారం.

ఇదిలా ఉంటే మంగళవారం నాటికి సరకుతో ఉన్న 187 ట్యాంకర్లు సహా 1000కి పైగా నౌకలు హోర్ముజ్ సమీపంలోనే ఉన్నాయని క్లెప్లర్ పేర్కొంది. పరిస్థితులు కుదటపడి, సాధారణ రాకపోకలు ప్రారంభమైనా ఈ నౌకలు జలసంధిని దాటేందుకు రెండు వారాలకు పైనే పడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే.. హోర్ముజ్ జలసంధి ద్వారా ప్రయాణించే నౌకల కోసం ఇరాన్ ప్రత్యామ్నాయ మార్గాలను ఇరాన్ ప్రకటించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.

పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా, దాని మిత్రదేశాల నౌకలను అడ్డుకోవడానికి ఇరాన్ జలసంధిలో సీమైన్స్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం నౌకలు ఆ సీమైన్స్ బారిన పడకుండా ప్రత్యామ్నాయ మార్గాలను వెల్లడించింది. సముద్ర భద్రతా నియమాలకు అనుగుణంగా సీమైన్స్ నుంచి తప్పించుకోవడానికి హోర్ముజ్ లో నౌకలు ప్రత్యామ్నాయ మార్గాలు తీసుకోవాలని ఐఆర్‌జీసీ ప్రకటించినట్లు సమాచారం.

అయితే లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులతో సీజ్‌ఫైర్ బెడిసికొట్టి, పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చేలా ఉంది. అమెరికాతో ఒప్పందం ప్రకారం.. హోర్ముజ్‌ను తెరిచిన టెహ్రాన్.. లెబనాన్‌పై దాడులకు ప్రతీకారంగా జలసంధిని మళ్లీ మూసేసింది. కాల్పుల విరమణ నుంచి వైదొలుగుతామని హెచ్చరించింది. ఈ జలసంధిపై అంతా గందరగోళ పరిస్థితి నెలకొంది.