26 August, 2026 | 7:09 PM

సర్వర్‌ మొరాయింపు.. రేషన్‌ బియ్యం కోసం పడిగాపులు

26-08-2026 06:16 PM

బూర్గంపాడు,(విజయక్రాంతి): మూడు నెలల రేషన్‌ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేస్తున్న నేపథ్యంలో సర్వర్‌ మొరాయించడంతో మండలంలోని ఇరవెండి గ్రామ పంచాయతీ పరిధిలోని లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రేషన్‌ బియ్యం కోసం గంటల తరబడి దుకాణాల వద్ద పడిగాపులు కాయాల్సి వచ్చింది. ఈ నెల 30వ తేదీ వరకు మాత్రమే పంపిణీ గడువు ఉందని తెలియడంతో లబ్ధిదారుల్లో ఆందోళన నెలకొంది.

సమాచారం తెలుసుకున్న సర్పంచ్‌ గుండి బాబురావు, ఉప సర్పంచ్‌ మహంకాళి రామారావు రేషన్‌ దుకాణం వద్దకు చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అనంతరం బూర్గంపాడు డిప్యూటీ తహసీల్దార్‌ సమ్మయ్యను గ్రామానికి పిలిపించి సమస్యను వివరించారు. సర్వర్‌ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి, అవసరమైతే రేషన్‌ బియ్యం పంపిణీ గడువును పొడిగించేలా చర్యలు తీసుకుంటామని డిప్యూటీ తహసీల్దార్‌ హామీ ఇచ్చారు. అర్హులైన ప్రతి కుటుంబానికీ బియ్యం అందే వరకు పంపిణీ ప్రక్రియను కొనసాగించాలని సర్పంచ్‌, ఉప సర్పంచ్‌లు అధికారులను కోరారు.