19 May, 2026 | 10:17 PM

Breaking News

ఖమ్మం - సూర్యాపేట జాతీయ రహదారిపై రాస్తారోక చేస్తున్న మాజీ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్   •   డీజీపీ సీవీ ఆనంద్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ డిసిసిబి చైర్మన్   •   రూ.21.49 లక్షల విలువైన నకిలీ వరి విత్తనాల పట్టివేత   •   హిజ్రాల ఆగడాలకు చెక్ పెట్టేందుకు పోలీస్ శాఖ చర్యలు   •   పీహెచ్సీలో అందిస్తున్న వైద్య సేవల పరిశీలన   •   ధాన్యం అన్‌లోడింగ్‌లో జాప్యం లేకుండా వెంటనే చర్యలు తీసుకోవాలి   •   ఆందోళన వద్దు.. బంద్ రోజున మందులు అందుబాటులోనే   •   మంగళవారం సంతలో పూర్తిగా ట్రాఫిక్ అంతరాయం   •   మొక్కజొన్న స్టాక్ పాయింట్లను తనిఖీ చేసిన డీఎం   •   ఖానాపూర్ మండలంలో పైలట్ గ్రామాన్ని సందర్శించిన అధికారులు   •  

రూ.21.49 లక్షల విలువైన నకిలీ వరి విత్తనాల పట్టివేత

19-05-2026 08:54 PM

చెన్నూర్,(విజయక్రాంతి): రైతులకు నకిలీ విత్తనాలు విక్రయించి మోసం చేసేందుకు యత్నిస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టును మంచిర్యాల జిల్లా కోటపల్లి పోలీసులు రట్టు చేశారు. సరైన అనుమతులు, బిల్లులు లేకుండా మహారాష్ట్ర నుంచి లారీలో అక్రమంగా తరలిస్తున్న సుమారు 30,700 కిలోల (30.7 టన్నులు) వరి విత్తనాలను రాపన్‌పల్లి అంతర్రాష్ట్ర చెక్‌పోస్ట్ వద్ద పట్టుకున్నారు. వీటి విలువ సుమారు రూ.21.49 లక్షలు ఉంటుందని జైపూర్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ) ఏ వెంకటేశ్వర్లు వెల్లడించారు.

మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన కేసుకు సంబంధించిన వివరాలను మీడియాకు తెలియజేశారు. కోటపల్లి మండల వ్యవసాయ అధికారి (ఏఓ) సాయి కృష్ణ రెడ్డి ఇచ్చిన ముందస్తు సమాచారం,ఫిర్యాదు మేరకు కోటపల్లి ఎస్సై ఆధ్వర్యంలో రాపన్‌పల్లి చెక్‌పోస్ట్ వద్ద విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో మహారాష్ట్రలోని సిరోంచా ప్రాంతం నుంచి తెలంగాణలోని మనకొండూర్ వైపు వెళ్తున్న లారీ (TS-29 TB-6555) ని ఆపి తనిఖీ చేశారు. లారీలో లోడ్ చేసి ఉన్న వరి విత్తనాల బస్తాలకు ఎలాంటి ప్రభుత్వ అనుమతులు, అధికారిక లేబుల్స్, ధృవీకరణ పత్రాలు (సర్టిఫికెట్లు), బిల్లులు లేవని గుర్తించారు.

విత్తనాల ప్యాకింగ్ కూడా చట్టబద్ధంగా లేకపోవడంతో, వాటిని సీడ్స్ యాక్ట్-1966, సీడ్ కంట్రోల్ ఆర్డర్-1983 నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తున్నట్లు నిర్ధారించి సీజ్ చేశారు. విత్తనాల నాణ్యతను పరిశీలించేందుకు నమూనాలను (శాంపిల్స్) హైదరాబాద్‌లోని ప్రభుత్వ అనుమతి పొందిన డీఎన్‌ఏ ఎఫ్‌పీ & టీసీఎం ల్యాబ్‌కు పంపినట్లు ఏసీపీ తెలిపారు. ఈ అక్రమ రవాణా ఘటనలో నిబంధనలు ఉల్లంఘించిన కట్ల భద్రయ్య (లారీ డ్రైవర్), నిమ్మటి సతీష్ ( సీడ్ ఆర్గనైజర్), జీఎన్‌వీ రామకృష్ణ (మేనేజింగ్ డైరెక్టర్,సోనం సీడ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్), పోలవేని రాజేష్ ( లారీ యజమాని) లపై కోటపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ పేర్కొన్నారు.

లాభార్జనే ధ్యేయంగా నకిలీ, అనుమతులు లేని విత్తనాలను రైతులకు విక్రయించి మోసం చేయాలని చూస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. ఇలాంటి విత్తనాల వల్ల పంటలు పండక రైతులు తీవ్ర ఆర్థిక నష్టాల్లో కూరుకుపోయి, చివరకు ఆత్మహత్యలకు పాల్పడే ప్రమాదం ఉందని, రైతులు విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలని, కేవలం ప్రభుత్వ గుర్తింపు పొందిన డీలర్ల వద్ద ధృవీకరించబడిన (సర్టిఫైడ్) విత్తనాలను మాత్రమే కొనుగోలు చేసి, తప్పనిసరిగా బిల్లులు తీసుకోవాలని ఏసీపీ రైతులకు సూచించారు. ఈ విలేకరుల సమావేశంలో చెన్నూర్ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆర్. కృష్ణ, కోటపల్లి సబ్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్, మండల వ్యవసాయ అధికారి (ఏఓ) సాయి కృష్ణ రెడ్డి, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.