రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు
మెరుగైన సాగు పద్ధతులపై రాఘవపూర్‌లో అవగాహన కార్యక్రమం
సిద్దిపేట జిల్లా: వ్యవసాయంలో అధిక దిగుబడులు సాధించడంతో పాటు ఖర్చులను తగ్గించుకునేందుకు శాస్త్రీయ సాగు పద్ధతులను రైతులు అనుసరించాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచించారు. సిద్దిపేట జిల్లా రాఘవపూర్ గ్రామంలో శనివారం రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమాన్ని నిర్వహించి రైతులకు పంటల సాగుపై సమగ్ర అవగాహన కల్పించారు. వ్యవసాయ పరిశోధన స్థానం తోర్నాల ఆధ్వర్యంలో, జిల్లా వ్యవసాయ శాఖ సహకారంతో జరిగిన ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్త డా. ఏ. రమాదేవి మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితులకు అనుకూలంగా కేఎన్‌ఎం-1638, బీపీటీ-5204, డబ్ల్యూజీఎల్-44 వరి రకాలను సాగు చేయాలని సూచించారు.
ప్రత్యామ్నాయ పంటల సాగు, నేల పరీక్షల ఆధారంగా యూరియా వినియోగం, పంటల అవసరానికి అనుగుణంగా రసాయనాల వాడకం, నేల సంరక్షణ, పచ్చిరొట్ట ఎరువుల వినియోగంపై రైతులకు వివరించారు. మండల వ్యవసాయ అధికారి ఎం.నరేష్ మాట్లాడుతూ... రైతు ఉత్పత్తిదారుల సంఘాల ఎఫ్పిఓ ద్వారా పంట సాగు చేస్తే మార్కెటింగ్‌లో మెరుగైన లాభాలు పొందవచ్చన్నారు. మార్కెట్‌లో డిమాండ్ ఉన్న వరి రకాలను ఎంపిక చేసుకోవడంతో పాటు పచ్చిరొట్ట పంటలను తప్పనిసరిగా సాగు చేయాలని సూచించారు.






