ఫెర్టిలిటీ ప్రైవేట్ దవాఖానలో దోపిడీ
- పిల్లలు లేరని వస్తే... లక్షల ఫీజు వసూలు
- దంపతులకు తీరని శోకం మిగిల్చిన వైద్యురాలు
- కొత్తపేటలోని ‘జెన్ సిస్‘ దవాఖాన వద్ద ఆందోళన
ఎల్బీనగర్, ఆగస్టు 11 : వైద్యం ఖరీదు అయిపోయింది. ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో వైద్యాన్ని వ్యాపారంగా మార్చి, కొన్ని కార్పొరేట్ ఆసుపత్రుల యజమాన్యాలు ఇష్టానుసారంగా ప్రజలను దోచు కుంటున్నాయి. వైద్యో నారాయణి హరి అనే పదానికి అర్ధాన్ని మార్చేసి ఘరానా దోపిడీకి తెగబడుతున్నారు. పిల్లలు లేరని వస్తే లక్ష ల్లో ఫీజు తీసుకుని సరైన చికిత్స ఇవ్వకుండా ఒక జంటకు తీరని శోకం మిగిల్చారు.
ఈ ఘటన మంగళవారం కొత్తపేట మెట్రో స్టేషన్ సమీపంలోని గ్రీన్ హిల్స్ కాలనీలో ఉన్నటువంటి జెన్ సిస్ సంతాన సాఫల్య కేంద్రంలో వెలుగులోకి వచ్చింది. పిల్లలు లేని దంపతులను టార్గెట్ చేస్తూ ఐవీఎఫ్ పద్ధతిలో సంతాన భాగ్యం కలిగిస్తామని, లక్షల్లో వసూళ్లకు పాల్పడి చివరికి బాధితురాలికి సంతాన భాగ్యం కలగకపోగా, ఆ మహిళకు మాతృమూర్తి అనే పదాన్ని దూరం చేశారు. జెన్ సిస్ సంతాన సాఫల్య కేంద్రం వైద్య బృందం తమకు తీవ్ర అన్యాయం చేశారని బాధితులు ఆందోళన చేపట్టారు.
బాధిత మహిళ కుటుంబ సభ్యులు, తెలిపిన వివరాలు... నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం బోటిమీది తండా గ్రామానికి చెందిన నేనావత్ గీత (32), నేనావత్ జయపాల్ నాయక్ (41) భార్యాభర్తలు. వీరికి సంతానం లేకపోవడంతో భార్యాభర్తలు ఇద్దరు గత సంవత్సరం 2025 మే నెల నుండి కొత్తపేట మెట్రో స్టేషన్ సమీపంలోని జెన్ సిస్ సంతాన సాఫల్య కేంద్రం వైద్యురాలు ఆర్ నర్మదా వేణుగోపాల్ ని సంప్రదించారు.
సాఫల్య కేంద్రంలో వైద్యం చేయించుకున్నప్పటికీ అన్ని పరీక్షలు నిర్వహించిన డాక్టర్ నర్మదా శిశువు బాగానే పెరుగుతుందని, ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని తెలిపిందని వాపోయారు. ఈ క్రమంలో బాధితురాలు గీత అనారోగ్య సమస్యలు తలెత్తడంతో గర్భంలో ఉన్న శిశువు మృతి చెందిందని, వైద్యుల సూచన మేరకు అబార్షన్ చేయించాల్సి వచ్చిందని వెల్లడించారు. తమకు జరిగిన అన్యాయంపై డాక్టర్ నర్మదాను సంప్రదించగా ఇస్లానుసారంగా బెదిరింపులకు పాల్పడిందని ఆరోపించారు.
ఈ క్రమంలో బాధితురాలు బంధువుల కుటుంబ సభ్యులు, బహుజన సంఘాల నాయకులు న్యాయం చేయాలంటూ బాధితులతో కలిసి ఆందోళన నిర్వహించారు. సమాచారం తెలుసుకున్న చైతన్యపురి పోలీసులు అవాంఛనీయ సంఘటన జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. అనంతరం బాధితులు చైతన్యపురి పోలీస్ స్టేషన్ లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశామని, బాధితురాలికి న్యాయం చేయకపోతే తీవ్రస్థాయిలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ సంఘటనపై వివరణ కోరేందుకు ఆసుపత్రిలో సంప్రదించగా డాక్టర్ అందుబాటులో లేరని సిబ్బంది చెప్పడం గమనార్హం.






