25 March, 2026 | 3:26 AM

పెండింగ్ భవన నిర్మాణ అనుమతులపై సమీక్ష

25-03-2026 12:00 AM

పట్టణ ప్రణాళిక విభాగం అధికారులతో ఎంఎంసీ కమిషనర్ సమీక్ష

సికింద్రాబాద్, మార్చ్24 (విజయక్రాంతి): మల్కాజిగిరి నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో ఎంఎంసి కమిషనర్ టి. వినయ్ క్రిష్ణారెడ్డి పట్టణ ప్రణాళిక విభాగం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. బిల్‌నౌ అప్లికేషన్‌లో పెండింగ్‌లో ఉన్న భవన నిర్మాణ అనుమతులను సర్కిల్,జోన్ లవారిగా సమీక్షించారు. అదే విధంగా ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల పెండింగ్ వివరాలను కూడా ఈ సమావేశంలో సమీక్షించారు. అనవసరంగా షార్ట్ ఫాల్ రాసి దరఖాస్తులను తిప్పి పంపవద్దని,షార్ట్ ఫాల్స్ ఉంటే అన్ని ఒకేసారి తెలియజేయాలని ఆదేశించారు.

కాలనీలలో మెయిన్ రోడ్ల మీద ఆక్రమణలు లేకుండా చూడాలని తెలిపారు. నాళాల మీద ఉన్న తాత్కాలిక ఆక్రమణలను వెంటనే తొలగించాలని ఆదేశించారు. నాళాల మీద ఉన్న ఆక్రమణలను తొలగించడం ద్వారా నాళాల పూడిక తీయడానికి సులభం అవుతుందని తెలిపారు.భవన నిర్మాణాలకు సంబంధించి పిర్యాదులు అందిన వెంటనే అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

కంటెంప్ట్ కేసులకు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఎంఎంసి కమిషనర్ టి.వినయ్ కృష్ణారెడ్డి రెడ్డితో చీఫ్ సిటీ ప్లానర్ ప్రదీప్ కుమార్, అడిషనల్ చీఫ్ సిటీ ప్లానర్ రంజిత్ కుమార్, జోనల్ సిటీ ప్లానర్‌లు, అడిషనల్ సిటీ ప్లానర్ లు, ఇతర టౌన్ ప్లానింగ్ అధికారులు పాల్గొన్నారు.