27 February, 2026 | 6:21 PM

ఉచిత కంటి వైద్య శిబిరానికి స్పందన

27-02-2026 03:46 PM

- రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమం: జిల్లా ఎస్పీ నితిక పంత్

కాగజ్ నగర్,(విజయక్రాంతి): మద్యం సేవించి వాహనాలు నడపడం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ రాష్ డ్రైవింగ్ చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ నితిక పంత్ అన్నారు. రోడ్డు ప్రమాదాలను నివారించడమే లక్ష్యంగా పోలీస్ శాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో భాగంగా, కాగజ్‌నగర్ పట్టణంలోని ఎస్‌పిఎమ్ హెచ్‌ఆర్‌డీ భవనంలో శుక్రవారం కాగజ్‌నగర్ టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో, కాగజనగర్ మెడికల్ అసోసియేషన్ సౌజన్యంతోలారీ, ట్రక్ డ్రైవర్లు మరియు క్లీనర్లకు ఉచిత కంటి పరీక్ష శిబిరాన్ని ఎస్పీ ప్రారంభించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ఎస్పీ మాట్లాడుతూ  ఉచిత కంటి పరీక్ష శిబిరాన్ని  ప్రారంభించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణాల్లో ఒకటైన చూపు లోపాలను ముందుగానే గుర్తించి చికిత్స చేయించుకోవడం ఎంతగానో అవసరమని తెలిపారు. ముఖ్యంగా లారీ, ట్రక్ డ్రైవర్లు  ప్రయాణాలు చేసే సమయంలో స్పష్టమైన చూపు ఉండటం అత్యంత కీలకమని పేర్కొన్నారు.

అలాగే, వాహనాలను నడిపేటప్పుడు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, మద్యం సేవించి వాహనం నడపరాదని, అధిక వేగాన్ని నివారిస్తూ జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలని డ్రైవర్లకు సూచించారు. రాష్ డ్రైవింగ్, నిర్లక్ష్యపు డ్రైవింగ్, హెవీ లోడ్ డ్రైవింగ్ చేయరాదన్నారు. డ్రైవింగ్ బాధ్యతను గుర్తించి, తమతో పాటు రోడ్డు మీద ఉన్న ఇతరుల ప్రాణాలను కూడా కాపాడాల్సిన బాధ్యత ప్రతి వాహనదారుడిపై ఉందని ఎస్పీ స్పష్టం చేశారు. ఈ శిబిరంలో పాల్గొన్న డ్రైవర్లు, క్లీనర్లు కంటి పరీక్షలు చేయించుకొని, అవసరమైన వారు వైద్యుల సూచనలు తీసుకున్నారు.