20 May, 2026 | 12:29 PM

దేశవ్యాప్త కెమిస్టుల సమ్మెకు తంగళ్లపల్లిలో భారీ స్పందన

20-05-2026 11:15 AM

తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలో ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ (AIOCD) పిలుపు మేరకు బుధవారం నిర్వహించిన దేశవ్యాప్త కెమిస్టుల సమ్మెకు భారీ స్పందన లభించింది. మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో మెడికల్ షాపులు మూతపడి సమ్మెలో పాల్గొన్నాయి. ఆన్‌లైన్ ద్వారా మందుల విక్రయాలను నిలిపివేయాలని, కార్పొరేట్ సంస్థలు అమలు చేస్తున్న భారీ డిస్కౌంట్ విధానాలను అరికట్టాలని, నకిలీ మందుల నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవాలని కెమిస్టులు డిమాండ్ చేశారు.

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొన్ని నిబంధనలను ఉపసంహరించుకోవాలని వారు కోరారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ చిన్న మెడికల్ దుకాణాల మనుగడకు ముప్పు వాటిల్లుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజా ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యతలో భాగంగానే ఈ సమ్మె చేపట్టినట్లు తెలిపారు. సమ్మె కారణంగా మందుల కోసం వచ్చిన ప్రజలకు కొంత అసౌకర్యం కలిగినా తమ సమస్యలను ప్రభుత్వం గుర్తించి పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ అసోసియేషన్, రాజన్న సిరిసిల్ల జిల్లా కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు, సభ్యులు పెద్ద ఎత్తున సమ్మెలో పాల్గొన్నారు.