48గంటల రిలే నిరాహార దీక్ష పోస్టర్ ఆవిష్కరించిన గొండ్వాన సంక్షేమ పరిషత్
చర్ల, విజయ క్రాంతి: చర్ల మండలం పెద్దమిడిసిలేరు గ్రామంలో ఆదివారం గొండ్వాన సంక్షేమ పరిషత్ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. జిల్లా అధ్యక్షులు బీరబోయిన శేఖర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గొంది లీలా ప్రసాద్ మాట్లాడారు. సెప్టెంబర్ 1, 2 తేదీలలో నిర్వహించనున్న 48 గంటల రిలే నిరాహార దీక్షలకు ఆదివాసీ యువతీ యువకులు, నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
జీవో నంబర్ 3 స్థానంలో కొత్త జీవో తీసుకువచ్చి రాష్ట్ర అసెంబ్లీలో చట్టం చేయాలని, అదేవిధంగా ఐటీడీఏ పరిధిలో ఉన్న ఉపాధ్యాయ ఖాళీలను తక్షణమే భర్తీ చేసి గిరిజన నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీతమ్మ సాగర్ ప్రాజెక్టు కింద దుమ్ముగూడెం, చర్ల మండలాల్లో ప్రభుత్వ భూములకు LTR 1/70 చట్టానికి విరుద్ధంగా గిరిజనేతరులకు లక్షల్లో నష్టపరిహారం అందిన వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు.
అనంతరం సంఘ నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో 48 గంటల దీక్ష పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఇర్ప అంజి బాబు, మండల ప్రధాన కార్యదర్శి కాయం శ్రీనివాస్, బీరబోయిన జగపతి, బెండబోయిన కౌశిక్, కురుసం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.






