రేషన్ బియ్యం దందా బట్టబయలు
గోండియాకు అక్రమంగా తరలిస్తున్న 350 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం
లారీ సీజ్,అక్రమ రవాణా వెనుక సూత్రధారులపై అధికారుల ఆరా
నర్సాపూర్: నర్సాపూర్ మీదుగా మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్న భారీ మొత్తంలో రేషన్ బియ్యాన్ని పౌరసరఫరాల శాఖ అధికారులు పట్టుకున్నారు. హైదరాబాద్ నుంచి నర్సాపూర్ మీదుగా మహారాష్ట్రలోని గోండియాకు లారీలో గుట్టుగా తరలిస్తున్న సుమారు 350 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని నర్సాపూర్ ఆర్టీసీ డిపో సమీపంలో స్వాధీనం చేసుకున్నారు. బియ్యంతో పాటు రవాణాకు ఉపయోగించిన లారీని సీజ్ చేశారు.
పక్కా సమాచారంతో దాడి: సివిల్ సప్లై డీఎస్పీ వెంకటేశం ఆదేశాల మేరకు అధికారులు పక్కా సమాచారంతో తనిఖీలు చేపట్టి లారీని పట్టుకున్నారు. స్వాధీనం చేసుకున్న లారీని తదుపరి విచారణ నిమిత్తం లింగాపూర్‌లోని తిరుమల ఆగ్రో మిల్లుకు తరలించినట్లు సివిల్ సప్లై ఇన్‌స్పెక్టర్ నర్సింలు తెలిపారు. బియ్యం ఎక్కడి నుంచి సేకరించారు? గోండియాకు ఎవరికి తరలిస్తున్నారు? ఈ అక్రమ రవాణా వెనుక ఉన్న సూత్రధారులు ఎవరు? అనే కోణాల్లో అధికారులు విచారణ చేపట్టారు. లారీ డ్రైవర్‌ను విచారించడం ద్వారా మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ దాడిలో సివిల్ సప్లై డీఎస్పీ వెంకటేశం, ఇన్‌స్పెక్టర్ నర్సింలు, నర్సాపూర్ ఎస్‌ఐ-2 కృష్ణతో పాటు సిబ్బంది పాల్గొన్నారు.






