14 August, 2026 | 11:41 AM

గ్రామపంచాయతీలకు హైమాస్ విద్యుత్ స్తంభాలు భారం

14-08-2026 10:48 AM

బోథ్, ఆగస్టు 14 (విజయక్రాంతి): వివిధ గ్రామాలలో ఏర్పాటు చేస్తున్న హైమాస్ విద్యుత్ స్తంభాలు గ్రామపంచాయతీలకు భారంగా మారాయి. నియోజకవర్గ పరిధిలోని అనేక గ్రామాల్లో హైమాస్ విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేశారు. అయితే విద్యుత్ స్తంభాలకు అమర్చిన విద్యుత్ బల్బులు అధిక ఓల్టేజీ వి కావడంతో నెల నెల వచ్చే విద్యుత్ బిల్లులు తడిసి మోపిడుగుతున్నాయి. దీంతో బిల్లులు కట్టలేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. 

అడగగానే మంజూరు చేశారు

వివిధ గ్రామాల నాయకులు స్థానిక ఎమ్మెల్యే తో పాటు అధికార పార్టీ నాయకులను హైమాస్ విద్యుత్ స్తంభాలు ఇవ్వాలని అడగడంతోనే మంజూరి ఇచ్చేశారు. దీంతో అధికార ప్రతిపక్ష పార్టీల నాయకులు గ్రామాలలో పోటీపడి హైమన్ విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేశారు. విద్యుత్ స్తంభాల ఏర్పాటు నాయకులకు లాభసాటిగా ఉండడంతో అడ్డగోలుగా స్తంభాలను ఏర్పాటు చేయడం జరిగింది. విద్యుత్ స్తంభం ఏర్పాటు చేయాలంటే 30 వేల నుండి 40,000 వరకు ఖర్చు అవుతున్నది. రికార్డు మాత్రం లక్ష రూపాయలకు పైగానే అవుతుండడంతో నాయకులకు లాభసాటి వ్యాపారంగా మారింది. దీంతో గ్రామస్థాయి నాయకులు హైమాస్ విద్యుత్ స్తంభాలఏర్పాటుపై పోటీపడి ఏర్పాటు చేశారు. దీంతో గ్రామాలలో ప్రధాన కూడళ్లలో వెలుగుల తో మెరిసిపోతున్నాయి. 

వార్డు మెంబర్లకు హైమాస్ లైట్ల నజరానా

మండల కేంద్రంలోని వార్డు సభ్యులకు ఒక్కో హైమాస్ లైట్లను మంజూరు చేశారు. దీంతో పట్టణంలోని ప్రతి వార్డులో పంచాయతీ వారి తరఫున హైమాస్ విద్యుత్ స్తంభాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వార్డు సభ్యులు తమ పరిపతి కోసం ప్రాకులాడుతుంటే పనులను రికార్డు చేయించుకునే వారు మాత్రం లాభపడుతుంటారని పరిశీలకులు అంటున్నారు. హైమాస్ విద్యుత్ స్తంభాల వెనుక అవినీతి అధికంగా ఉందని పలువురు పేర్కొంటున్నారు. 

నిర్వహణ భారంగా

విద్యుత్ స్తంభాలకు ఏర్పాటుచేసిన విద్యుత్ బల్బులు నాసిరకంగా ఉండడంతో మూడు నెలలకి చెడిపోతున్నాయి. వీటి నిర్వహణ గ్రామ పంచాయతీల వారికి భారంగా మారింది. కొన్ని గ్రామపంచాయతీలలో విద్యుత్ లైట్ల మరమ్మతు పేరుతో వేల రూపాయల్లో బిల్లులు తీసుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఏది ఏమైనా హైమాస్ విద్యుత్ వెలుగుల వల్ల కాంతి కాలుష్యం అవుతుందని నిపుణులు అంటున్నారు.