28 August, 2026 | 9:08 PM

నిస్వార్ధ సేవకు అర్ధం చెప్పిన రాఖీ బంధం

28-08-2026 04:52 PM

తోబుట్టువులు లేని లోటును తీర్చిన వందలాది మంది ఆడబిడ్డల ఆత్మీయ అనుబంధం! 

కేసముద్రం, (విజయక్రాంతి): రాజకీయాలు, అధికారం, పదవులు... ఇవన్నీ తాత్కాలికం. కానీ మనుషుల నడుమ ఉండే ఆప్యాయత, పవిత్రమైన అనుబంధాలే శాశ్వతమని కేసముద్రం మండల కాంగ్రెస్ అధ్యక్షుడు, సమ్మయ్య గౌడ్ సమ్మి  ఫౌండేషన్ అధినేత కేసముద్రం సమ్మయ్య గౌడ్ మరోసారి నిరూపించారు. దేవుడు సొంత రక్తసంబంధమైన అక్క చెల్లెళ్లను ఇవ్వలేదనే చిన్న వెలితి ఆయనలో ఉన్నా... ఊరంతా తన కుటుంబమే అనుకుని, దారిలో ఎదురయ్యే ఏ మహిళనైనా 'అక్కా బాగున్నావా.. చెల్లీ బాగున్నావా' అంటూ కంటికి రెప్పలా ఆప్యాయంగా పలకరించే ఆయనకు, ఊరి ఆడపడుచులు అరుదైన నీరాజనం అర్పించారు.

రాఖీ పౌర్ణమి వేడుకలకు రెండు రోజుల ముందే సమ్మయ్య గౌడ్ నివాసం ఒక ఆత్మీయ సాగరాన్ని తలపించింది. తమను సొంత అక్కచెల్లెళ్లలా భావించి ఆదరించే సమ్మయ్య గౌడ్ కు రాఖీ కట్టి తమ ప్రేమానురాగాలను చాటుకోవడానికి పెద్ద ఎత్తున ఆడబిడ్డలు ఒక్కసారిగా ఆయన గృహానికి తరలివచ్చారు. తనపై చూపించిన ఈ అపారమైన ప్రేమను చూసి సమ్మయ్య గౌడ్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. రాఖీ కట్టిన ప్రతి ఒక్క ఆడబిడ్డకు సమ్మయ్య గౌడ్ పాదాభివందనం చేశారు.  మీరు నాపై చూపించిన ఈ ప్రేమానురాగాలకు నేను జన్మజన్మలకీ రుణపడి ఉంటానని, మీ అన్నగా, తమ్ముడిగా ఏ కష్టం వచ్చినా ప్రతీ ఆడబిడ్డకు ముందువరుసలో అండగా నిలబడతాను. సమ్మి గౌడ్ ఫౌండేషన్ ద్వారా మహిళా సాధికారతకు, పేద అక్కచెల్లెళ్ల విద్య, ఆరోగ్య రక్షణకు నా శ్వాస ఉన్నంత వరకు కృషి చేస్తాను అని చేమర్చిన కళ్ళతో రక్షాబంధన్ కట్టిన ఆడబిడ్డలకు మాటిచ్చారు.