18 August, 2026 | 6:23 PM

రాజీవ్ యువ వికాస్ పథకం ఎక్కడ? : నవీన్ రెడ్డి

18-08-2026 05:12 PM

తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం రాజీవ్ యువ వికాస్ పథకాన్ని వెంటనే అమలు చేయాలని బీఆర్‌ఎస్ యువ నాయకుడు నవీన్ రెడ్డి డిమాండ్ చేశారు. రాజీవ్ గాంధీ జయంతి, సద్భావన దినోత్సవం సందర్భంగా తంగళ్లపల్లి మండల కేంద్రంలోని రాజీవ్ గాంధీ విగ్రహానికి బీఆర్‌ఎస్ యువ నాయకులు వినూత్న రీతిలో వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా నవీన్ రెడ్డి మాట్లాడుతూ.. రాజీవ్ యువ వికాస్ కోసం సుమారు 16 లక్షల దరఖాస్తులు రాగా, వాటిలో 10 లక్షల దరఖాస్తులు అర్హత సాధించినట్లు ప్రభుత్వం గుర్తించినప్పటికీ ఇప్పటివరకు ఒక్క లబ్ధిదారుడికి కూడా పథకం అందకపోవడం దారుణమన్నారు.

దరఖాస్తుల కోసం క్యాస్ట్, ఇన్‌కమ్, రెసిడెన్సీ తదితర ధ్రువపత్రాలు సమర్పించేందుకు యువతకు అదనపు ఆర్థిక భారం పడిందన్నారు.2026-27 బడ్జెట్‌లో రాజీవ్ యువ వికాస్ కోసం రూ.5,800 కోట్లు కేటాయించినట్లు ప్రకటించిన ప్రభుత్వం, ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని ఆరోపించారు. ఎస్టీ యువత కోసం రూ.1,300 కోట్లు, ఎస్సీ యువత కోసం రూ.2,000 కోట్లు కేటాయించినా వాటిని అమలు చేయకుండా మోసం చేసిందని విమర్శించారు. యువతకు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు.

రాజీవ్ గాంధీ ఆశయాలను నిజంగా గౌరవిస్తే ముందుగా యువతకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని సూచించారు.రాజీవ్ యువ వికాస్ పథకాన్ని అమలు చేయకుండా నివాళులు అర్పించడం సరికాదని, ప్రభుత్వం హామీలను అమలు చేయకపోతే కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ప్రజలకు వివరిస్తూ ప్రతి ఇంటికీ వెళ్లి యువతను చైతన్యపరుస్తామని బీఆర్‌ఎస్ యువ నాయకులు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో నేరెళ్ల అనిల్ గౌడ్, ఎగుర్ల కనకరాజు, అంకారపు మహేందర్, నమిలికొండ అనిల్, గోడిసేలా బాబు, మామిడాల విజయ్, మామిడాల ఉమాశంకర్, గుర్రం శ్రీకాంత్, రడం అనిల్ తదితరులు పాల్గొన్నారు.