calender_icon.png 12 February, 2026 | 3:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాహుల్ X కేంద్రం

12-02-2026 01:59:48 AM

దేశాన్ని అమ్మేశారు: లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్

మోదీ అమెరికాకు తలొగ్గి ఒప్పందం ఖాయం చేశారు..

ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో హర్దీప్ సింగ్ పూరీ పేరెందుకు ఉందని నిలదీత

ఎదురుదాడికి దిగిన అధికార పక్షం

ఎలా అమ్మేశామో నిరూపించాలని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు సవాల్

సభలో ఎప్‌స్టీన్ ఫైల్స్ ప్రస్తావనపై బీజేపీ సభ్యుల అభ్యంతరాలు

ఎప్‌స్టీన్‌తో నా భేటీ అధికారికం: కేంద్ర మంత్రి హర్దీప్‌సింగ్ పూరీ

న్యూఢిల్లీ, ఫిబ్రవరి ౧౧: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశాన్ని అడ్డంగా అమెరికాకు అమ్మేసిందని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ అమెరికాకు తలొగ్గి తాత్కాలిక వాణిజ్య ఒప్పందం చేసుకున్నారని విమర్శించారు. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం ఆయన సభావేదికగా కేంద్ర ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. బడ్జెట్ అంశాన్ని పక్కనపెట్టి, రాహుల్ భారత్ -అమెరికా వాణిజ్య ఒప్పందంపై ప్రసంగించడం, ఎప్‌స్టీన్ ఫైల్స్‌ను ప్రస్తావించడం బీజేపీ సభ్యులు తప్పుబట్టారు. అయినప్పటికీ.. రాహుల్ తన ప్రసంగాన్ని కొనగిస్తూ..

ప్రధాని మోదీ 150 కోట్ల మంది భారతీయుల భవిష్యత్తును ఫణంగా పెట్టారని ఆరోపించారు. బీజేపీ తన ఆర్థిక ప్రయోజనాలను కాపాడుకోవడం కోసమే అమెరికాతో ఒప్పందానికి తలొగ్గిందని అభిప్రాయపడ్డారు. ఆ ఒప్పందం దేశ ఇంధన భద్రత దెబ్బతింటుందని, రష్యా నుంచి చమురు కొనవద్దని అమెరికా ఆదేశించడం దేశ సార్వభౌమత్వానికి భంగకరమని పేర్కొన్నారు. భారత రైతుల ప్రయోజనాలనూ ప్రభుత్వం విస్మరించిందని దుయ్యబట్టారు.

భారత్ వద్ద ఉన్న విలువైన డేటాను అమెరికాకు అప్పగించారని రాహుల్ విమర్శించారు. అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్ ట్రంప్‌తో మాట్లాడేటప్పుడు భారత్ ఒక సమాన హోదా కలిగిన దేశంగా ఉండాలే కానీ, సేవకుడిలా వ్యవహరించకూడదని హితవు పలికారు. ‘గతంలో భారత ఉత్పత్తులపై కేవలం 3 శాతమే సుంకం ఉండేది. ఇప్పుడది 18 శాతానికి చేరింది.

అమెరికా దిగుమతులను 46 బిలియన్ డాలర్ల నుంచి ఏకంగా 100 బిలియన్ డాలర్లకు పెంచేశారు. ఒప్పందం ఎవరికి లాభమో అర్థం చేసుకోవాలి. ఈ ఒప్పందం ఎలాంటి భరోసా ఇవ్వడం లేదు’ అని వ్యాఖ్యానించారు. అలాగే కేంద్ర బడ్జెట్‌పైనా రాహుల్ ప్రసంగించారు. అంతర్జాతీయ, దేశీయ పరిస్థితులకు అనుగుణంగా బడ్జెట్ లేదని విమర్శించారు.

రాహుల్ వ్యాఖ్యలు తప్పుల తడక

కేంద్ర పార్లమెంట్ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు

లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ప్రసంగమంతా తప్పుల తడక, ఆయన బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్యలు చేస్తున్నరంటూ కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు మండిపడ్డారు. భారత ప్రభుత్వం దేశాన్ని అమెరికాకు అమ్మేసిందనే దిగజారుడు వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు. తాము దేశాన్ని ఎలా అమ్మేశామనేది నిరూపించాలని రాహుల్‌కు సవాల్ విసిరారు.

సభను తప్పుదోవ పట్టించేందుకే రాహుల్ నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాహుల్ వ్యాఖ్యలను సభా రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్‌ను కోరారు. ఒక ప్రతిపక్ష నేతకు ఉండాల్సిన సభ్యత, హుందాతనం రాహుల్‌లో లేవని వ్యాఖ్యానించారు. సభలో అబద్ధాలు చెప్పి వెంటనే అక్కడి నుంచి జారుకోవడం ఆయనకు అలవాటుగా మారిందని ఎద్దేవా చేశారు.

కేంద్ర మంత్రులు ఇచ్చే వివరణ వినే ధైర్యం కూడా లేదని దుయ్యబట్టారు. ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని కొనియాడారు. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీపై ఎలాంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండా ఆరోపణలు చేశారని, అది సభా హక్కుల ఉల్లంఘన కిందికే వస్తుందని అభిప్రాయపడ్డారు. దీనిపై తాము ప్రివిలేజ్ నోటీసు ఇస్తామని స్పష్టం చేశారు. 

ఎప్‌స్టీన్ ఫైల్స్‌తో నాకేం సంబంధం?

కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరీ

లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి అబద్ధాలు చెప్పడం అలవాటుగా మారిందని, ఆయన అచ్చంగా అబద్ధాల పుట్ట అని కేంద్ర మంత్రి హర్దీప్‌సింగ్ పూరీ మండిపడ్డారు. ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో తన పేరు ఉందని రాహుల్ సభలో ప్రస్తావించడాన్ని తప్పుబట్టారు. తనపై వచ్చిన ఆరోపణలు నిరాధారమైనవని కొట్టిపడేశారు. రాహుల్ గతంలో కూడా ఓటుచోరీ అంటూ గగ్గోలు పెట్టారని, చివరికి ఆ డ్రామా ఎలా విఫలమైందో అందరికీ తెలుసునని ఎద్దేవా చేశారు. తాను ఎప్‌స్టీన్‌ను కలిసిన మాట నిజమేనని, అయితే.. అది పూర్తిగా అధికారిక భేటీ అని స్పష్టం చేశారు.

అంతర్జాతీయ శాంతి సంస్థ (ఐపీఐ) కమిషన్ సభ్యుడిగా ఉన్న కాలంలో తాను ఎప్‌స్టీన్‌ను మూడు నాలుగు సార్లు మాత్రమే కలిశానని తెలిపారు. ఎప్‌స్టీన్ ఫైల్స్ అంటే లైంగిక నేరాలు, పీడోఫీలియా వంటి దారుణమైన ఆరోపణలకు సంబంధించినవని, వాటితో తనకు ఎలాంటి సంబంధం లేదని మంత్రి స్పష్టం చేశారు.

ఎప్‌స్టీన్ ఫైల్స్ ప్రస్తావనపై దుమారం 

లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తన ప్రసంగంలో ఎప్‌స్టీన్ ఫైల్స్ ప్రస్తావన తీసుకువచ్చారు. అదా నీ, అనిల్ అంబానీ, హర్దీప్‌సింగ్ పూరీ పేర్లు ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో ఎందుకు వ చ్చాయని ప్రశ్నించారు. ఆ ప్రశ్నలపై కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ పా యింట్ అభ్యంతరం తెలుపుతూ లైన్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తారు. దీంతో రాహు ల్ గాంధీ వ్యాఖ్యలను రికార్డులను తొలగించాలని స్పీకర్ స్థానంలో ఉన్న జగదాంబికా పాల్ ఆదేశాంచారు.

సభలో కేవలం బడ్జెట్ గురించి మాత్ర మే మాట్లాడాలని సూచించారు. మళ్లీ రాహుల్ గాంధీ తన ప్ర సంగాన్ని కొనసాగించాలని యత్నించగా, అధికార సభ్యుల నుంచి తీవ్రమై న అభ్యంతరా లు వ్యక్తమయ్యాయి. ప్రధాని మోదీ, కేంద్రమంత్రి హర్దీప్‌సింగ్‌పై రాహుల్ అసత్య వ్యాఖ్యలు చేశారని మండిపడుతూ సభాహక్కుల ఉల్లంఘన తీర్మా నానికి సిద్ధమయ్యాయి. ఆరోపణలపై రాహుల్ తన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని స్పీకర్ సూచించారు.