23 August, 2026 | 7:21 PM

బాన్సువాడలో ప్లాస్టిక్‌ నిషేధం అమలయ్యేనా...? యథేచ్ఛగా వినియోగం

23-08-2026 06:43 PM

ప్లాస్టిక్‌కు స్వస్తి..

పరిశుభ్ర బాన్సువాడకు నాందికి శ్రీకారం చుట్టాలని డిమాండ్

బాన్సువాడ, ఆగస్టు 23 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ మున్సిపల్ పరిధిలో ప్లాస్టిక్‌ వినియోగంతో పర్యావరణానికి పెరుగుతున్న ముప్పును అరికట్టేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. పట్టణాన్ని పరిశుభ్రంగా, పచ్చదనంతో నిండిన ప్రాంతంగా తీర్చిదిద్దడంతో పాటు ప్లాస్టిక్‌ రహిత బాన్సువాడగా మార్చేందుకు కఠిన నిర్ణయాలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.పట్టణంలోని ప్రధాన మార్కెట్లు, కూరగాయల మార్కెట్లు, హోటళ్లు, కిరాణా దుకాణాలు, తోపుడు బండ్ల వద్ద సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వినియోగం కొనసాగకుండా మున్సిపల్‌ సిబ్బంది నిరంతరం తనిఖీలు నిర్వహించాల్సి ఉంది. నిషేధిత ప్లాస్టిక్‌ కవర్లు విక్రయించినా, వినియోగించినా నిబంధనల ప్రకారం జరిమానాలు విధించి, వ్యాపారుల్లో బాధ్యత పెంచాల్సిన అవసరం ఉంది.గతంలోనూ బాన్సువాడ మున్సిపల్‌ అధికారులు ప్లాస్టిక్‌ విక్రయాలు, వినియోగంపై తనిఖీలు నిర్వహించి జరిమానాలు విధిస్తామని హెచ్చరించిన సందర్భాలు ఉన్నాయి. 2023లోనూ ప్లాస్టిక్‌ వినియోగంపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజల నుంచి డిమాండ్‌ వచ్చినట్లు వార్తలు ప్రచురితమయ్యాయి. ఇకపై బాన్సువాడ మున్సిపల్ శాఖ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు వేచి చూడాల్సిందే. 

చెత్తకుప్పల్లో ప్లాస్టిక్‌ వ్యర్థాలు

పట్టణంలోని పలు ప్రాంతాల్లో చెత్తకుప్పల్లో ప్లాస్టిక్‌ కవర్లు, బాటిళ్లు, ఇతర ప్లాస్టిక్‌ వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. ఇవి కాలువల్లో చేరడంతో మురుగు నీటి ప్రవాహానికి ఆటంకం ఏర్పడే పరిస్థితి ఉంది. వర్షాకాలంలో ప్లాస్టిక్‌ వ్యర్థాల కారణంగా డ్రైనేజీ వ్యవస్థపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది.

ప్రత్యామ్నాయ సంచులపై ప్రోత్సాహం

ప్లాస్టిక్‌ కవర్లకు బదులుగా వస్త్ర సంచులు, కాగితపు సంచులు, పర్యావరణహిత బ్యాగులను వినియోగించేలా ప్రజలను ప్రోత్సహించాలి. మున్సిపాలిటీ ఆధ్వర్యంలో మార్కెట్లు, ప్రధాన కూడళ్లలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించాలి.

వ్యాపారుల్లో మార్పు రావాలి

ప్లాస్టిక్‌ కవర్ల వినియోగాన్ని తగ్గించడంలో వ్యాపారుల పాత్ర కీలకం. దుకాణాలకు వచ్చే వినియోగదారులకు ప్లాస్టిక్‌ కవర్లకు బదులుగా పునర్వినియోగ సంచులు అందించేలా చర్యలు తీసుకోవాలి. మున్సిపల్‌ అధికారులు తరచూ తనిఖీలు నిర్వహించి నిబంధనలకు విరుద్ధంగా ప్లాస్టిక్‌ వినియోగిస్తున్న వారిపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలి.

ప్రతి వార్డులో అవగాహన కార్యక్రమాలు

బాన్సువాడ మున్సిపల్‌ పరిధిలోని ప్రతి వార్డులో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తే ప్రజల్లో చైతన్యం పెరిగే అవకాశం ఉంది. పాఠశాలలు, కళాశాలల విద్యార్థులను కూడా కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేసి ప్లాస్టిక్‌ వ్యతిరేక ప్రచారం నిర్వహించాలి.

ప్రజల సహకారంతోనే సాధ్యం...

గోపు గంగాధర్ మున్సిపల్ కమిషనర్ బాన్సువాడ

ప్లాస్టిక్‌ రహిత పట్టణం కేవలం అధికారుల చర్యలతో సాధ్యం కాదు. ప్రజలు కూడా బాధ్యతగా వ్యవహరించాలనీ మున్సిపల్ కమిషనర్ గోపూ గంగాధర్ ను విజయ్ క్రాంతి వివరణ కోరగా ఆయన తెలిపారు. ఇంటి నుంచే ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగ్గించి చెత్తను తడి, పొడి వ్యర్థాలుగా వేరు చేసి మున్సిపల్‌ సిబ్బందికి అందించాలి. ప్రజలు, వ్యాపారులు, మున్సిపల్‌ అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తే బాన్సువాడను పరిశుభ్రమైన, పర్యావరణహిత పట్టణంగా తీర్చిదిద్దవచ్చని ఆయన తెలిపారు. త్వరలోనే ప్లాస్టిక్ నిషేధంపై వ్యాపారస్తులు ప్రజలతో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని ప్రతి వార్డుల్లో కూడా ప్లాస్టిక్ వినియోగం లేకుండా ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని కమిషనర్ తెలిపారు. ప్లాస్టిక్‌కు స్వస్తి.. పరిశుభ్ర బాన్సువాడకు నాంది”అనే నినాదంతో సమిష్టి కార్యాచరణకు శ్రీకారం చూద్దామని ఆయన పేర్కొన్నారు.