23 August, 2026 | 7:33 PM

గురుస్వామి బోనకుర్తి అర్జున్‎కి ప్రత్యేక గురు పురస్కారం

23-08-2026 06:38 PM

ఘట్ కేసర్, ఆగస్టు 23 (విజయక్రాంతి):  హైదరాబాద్ లోని త్యాగరాయ గాన సభ లో శనివారం రాత్రి నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో పలువురు అయ్యప్ప గురుస్వాము లకు పురస్కార ప్రదానం అత్యంత వైభవంగా జరిగింది. ఈ పురస్కార గ్రహీతలలో ఘట్కేసర్ సర్కిల్, ఎదులాబాద్ డివిజన్ పరిధిలోని ఘనపురం కి చెందిన ప్రముఖ గురుస్వామి బోనకుర్తి అర్జున్ గురుస్వామి ప్రత్యేక పురస్కారాన్ని అందుకున్నారు. రాజు గురుస్వామి, ప్రదీప్ నంబూద్రి ఆధ్వర్యంలో నిర్వహించబడిన ఈ వేడుకలో శ్రీఅయ్యప్ప స్వామి వంశోద్ధారకులు, పందల రాజ్య వంశీయులు, తాంత్రిక గురుస్వామి ముఖ్య అతిథిగా విచ్చేశారు. వారి పవిత్ర హస్తాల మీదుగా గురుస్వాములకు పురస్కారాలను అందజేశారు.

అయ్యప్ప స్వామి సేవలో భక్తులకు దిశా నిర్దేశం చేయడంలో అర్జున్ గురుస్వామి  చేసిన కృషికి గాను ఈగౌరవం దక్కింది. శ్రీఅయ్యప్పస్వామిని తన ప్రాణంగా, అయ్యప్ప దీక్షను తన సర్వస్వంగా భావిస్తూ గత 30 సంవత్సరాలుగా స్వామివారి సేవలో నిరంతరం నిమగ్నమై ఉన్నారు. అయ్యప్ప దీక్షను అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరిస్తూ తమ గ్రామంలోనే కాకుండా పరిసర ప్రాంతాల్లో కూడా అనేక మంది అయ్యప్ప భక్తులను తీర్చిదిద్దారు. భక్తుల ధర్వసండేహలను నివృత్తి చేస్తూ, యువతను ధార్మిక మార్గంలో నడిపిస్తూ విశిష్ట సేవలను అందిస్తున్నారు. భక్తులకు శాశ్వత ధార్మిక సేవలు అందించాలనే సంకల్పంతో నూతన శ్రీఅయ్యప్పస్వామి దేవాలయ నిర్మాణాన్ని లక్ష్యంగా పెట్టుకుని విశేష కృషి చేస్తున్నారు. ఈసందర్భంగా గురుస్వాములందరూ తమ అనుభవాలను పంచుకుంటూ, అయ్యప్ప దీక్ష ప్రాముఖ్యతను వివరించారు. పందల రాజ్య వంశీయుల చేతుల మీదుగా పురస్కారం అందుకున్న అర్జున్ గురుస్వామిని ఇతర గురుస్వాములను భక్తులు అభినందించారు.