20 May, 2026 | 1:51 AM

ప్రభుత్వాసుపత్రిలో సైకో వీరంగం

20-05-2026 12:48 AM

పరుగులు తీసిన వైద్య సిబ్బంది, స్థానికులు

ఘట్‌కేసర్, మే 19 (విజయక్రాంతి): మేడ్చల్ జిల్లాలోని ఘట్‌కేసర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ సైకో సిబ్బందితో పాటు స్థానికులపై కత్తితో దాడులకు దిగేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటన మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్ ఎం. బాలస్వామి, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ప్రభుత్వ ఆసుపత్రికి ఓ గుర్తు తెలియని యువకుడు (24) తలకు తీవ్ర గాయంతో వచ్చాడు.

అరుస్తూ డ్యూటి వైద్యుడు అభిషేక్ వద్దకు వెళ్లి తనకు కుట్లు వేయాలని బెదిరించాడు. భయాందోళనకు గురైన వైద్యుడు అతడిని డ్రెస్సింగ్ గదికి తీసుకువెళ్లాడు. వెంటనే తలకు కుట్లు వేయాలని బెదిరించి అక్కడే ఉన్న వైద్యులు వాడే కత్తితో దాడికి దిగాడు. దీంతో వైద్యుడు అక్కడి నుంచి పరుగులు తీశాడు.

అక్కడి నుంచి నర్సు వద్దకు వెళ్లి ఆమెను పట్టుకొని తనకు కుట్లు వేయాలని లేకుంటే చంపేస్తానని బెదిరించాడు. ఈ సైకో చర్యలతో సిబ్బంది, రోగులు, వారి బంధువులు పరుగులు తీశారు. ఆసుపత్రిలో ఉన్నవారు ధైర్యంతో తిరగబడడంతో వారిని బెదిరిస్తూ అక్కడి నుంచి బయటికి పరుగులు తీశాడు. స్థానికులు గమనించి అతడిపై దాడి చేయగా అపస్మారక స్థితికి చేరుకున్నాడు. పోలీసులు సైకోను చికిత్స నిమిత్తం నగరంలోని గాంధీ దవాఖానకు తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.