ప్రముఖ నిర్మాత ఆర్‌బీ చౌదరి దుర్మరణం
ప్రముఖ దర్శక నిర్మాత ఆర్‌బీ చౌదరి (76) అకాల మరణం పొందారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన దుర్మరణం చెందారు. ఆర్‌బీ చౌదరి పూర్తిపేరు రతన్ లాల్ భగత్ రామ్ చౌదరి. సూపర్ గుడ్ ఫిలింస్ నిర్మాణ సంస్థ వ్యవస్థాపకుడిగా భారతీయ సినీపరిశ్రమలో ప్రముఖ నిర్మాతల్లో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నారాయన. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో 90కి పైగా చిత్రాలను నిర్మించారు.
మొదట మలయాళ చిత్ర పరిశ్రమలో నిర్మాతగా ప్రస్థానం ప్రారంభించిన చౌదరి.. సూపర్ అనే పేరుతో సినిమాలు నిర్మించారు. 1989 నుంచి తమిళ సినిమాల నిర్మాణం ప్రారంభించారు. 1980వ దశకంలో ఆయన స్థాపించిన ‘సూపర్ గుడ్ ఫిలింస్’ తెలుగు నాట ‘మెగా సూపర్ గుడ్ ఫిలింస్’గా సినీప్రియుల ఆదరాభిమానాలు పొందింది. ఈ బ్యానర్‌పై నిర్మించిన సినిమాలెన్నో ప్రేక్షకాదరణ పొందాయి.
సూర్యవంశం, సుస్వాగతం, రాజా, నిన్నే ప్రేమిస్తా, రచ్చ, నేటి గాంధీ, శీను, నువ్వు వస్తావని, ప్రియమైన నీకు, సింహరాశి, స్నేహమంటే ఇదేరా, శివరామరాజు, లవ్ టుడే, విద్యార్థి, సం క్రాంతి, అందాల రాముడు, అన్నవరం, నవవసంతం, గోరింటాకు, మిస్టర్ పెళ్ళికొడుకు, ద్వారక, భవనమ్ వంటివి చెప్పు కోదగ్గవి. ఆయన నిర్మించిన మరెన్నో సినిమాలు ఫిలింఫేర్, రాష్ట్ర ప్రభుత్వ అవార్డులను అందుకున్నాయి.
ప్రముఖ నటులు జీవా (‘రంగం’ హీరో), జితన్ రమేశ్ (‘విద్యార్థి’ హీరో) ఆయన కుమారులే. వీళ్లతోపాటు మరో ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. ఆర్‌బీ చౌదరి మరణ వార్త సినీపరిశ్రమను దిగ్బ్రాంతికి లోను చేసింది. ఆయన మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ.. ‘ఆర్‌బీ చౌదరి ఆకస్మిక దుర్మరణం మనసుని కలిచివేసింది. ఆయనతో నాకు ఎన్నో ఏళ్లుగా పరిచయం ఉంది. నా చిత్రం గాడ్ ఫాదర్ కోసం సూపర్ గుడ్ ఫిలిమ్స్ ద్వారా ఆయనతో పనిచేసే అవకాశం దక్కింది.
భారతీయ సినిమాకు ఆయన అందించిన సేవలు వర్ణనాతీతం. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నా” అని పేర్కొన్నారు. ‘ఆర్‌బీ చౌదరి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారనే వార్త నమ్మలేకపోయా. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాన’ని నటుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ తెలిపారు.
సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్‌లో 99వ చిత్రంగా ‘మకుటం’ రూపొందుతోంది. విశాల్ హీరోగా నటిస్తున్న ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్‌లో దశలో ఉంది. ఆర్‌బీ చౌదరి మరణ వార్త తెలుసుకున్న యూనిట్ సభ్యులు షూటింగ్ సెట్స్‌లో సంతాప సభ నిర్వహించి, నివాళులర్పించారు.






