ఇండస్ట్రీలో చెడు వాతావరణం నాకు కనిపించలేదు
కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బత్తుల సరస్వతి, బత్తుల కోటేశ్వరరావు నిర్మించిన చిత్రం ‘పురుషః’. ఈ సినిమాతో పవన్‌కళ్యాణ్ బత్తుల హీరోగా పరిచయం కాబోతోన్నారు. వీరు వులవల దర్శకత్వం వహించారు. రాయంచ కొక్కుర కథానాయిక. సప్తగిరి, కసిరెడ్డి, విషిక, హాసిని సుధీర్ ముఖ్యపాత్రలను పోషించారు.
మే 22న విడుదల చేయబోతున్న ఈ సినిమా విశేషాలను నిర్మాత కోటేశ్వరరావు మీడియాతో పంచుకున్నారు. “నేను పవన్‌కళ్యాణ్ అభిమానిని. అందుకే మా మా అబ్బాయికి ఆయన పేరు పెట్టా. హీరో అవ్వాలన్న నా కలను మా అబ్బాయి ద్వారా నెరవేర్చుకున్నా. డబ్బుల కోసం అయితే మూవీ తీయలేదు. డైరెక్టర్ వీరూ చెప్పిన కథ నాకు బాగా నచ్చింది. మా అబ్బాయి గురించి నేను చెప్పను. సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులే చెప్పాలి. మా సినిమాను 300 థియేటర్లలో రిలీజ్ చేస్తున్నాం.
మే 21 నుంచే రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్స్ వేస్తున్నాం. ‘పురుషః’ జర్నీలో ప్రతిఒక్కరూ ఓ పది రూపాయలు మిగిల్చేలానే చూశారు. నన్ను ఎక్కడా పీడించి డబ్బులు వసూల్ చేసిన దాఖలాలు లేవు. బయట చెప్పినట్టు ఇండస్ట్రీలో చెడు వాతావరణం నాకు కనిపించలేదు. మూడు సినిమాలు చేస్తానని మా అబ్బాయికి నేను ముందుగానే మాటిచ్చా. అప్పటివరకు మావాడు నిరూపించుకుని హీరోగా నిలబడితే ఓకే. లేదంటే మళ్లీ మా ఊరికి వచ్చి వ్యవసాయం చేయాలని చెప్పా” అని తెలిపారు.






