15 August, 2026 | 4:54 AM

‘వికసిత్ భారత్’ సాధనే లక్ష్యం

15-08-2026 02:11 AM

లక్ష్య సాధనలో ప్రతి పౌరుడూ భాగస్వామి కావాలి..

క్లిష్ట పరిస్థితుల్లోనూ భారత్ బలమైన ఆర్థిక శక్తిగా నిలిచింది..

‘ఇండిపెండెన్స్ డే’ సందేశంలో రాష్ట్రపతి ద్రౌపది పిలుపు

న్యూఢిల్లీ, ఆగస్టు ౧౪: ‘వికసిత్ భారత్’ సాధ నే భారత ప్రభుత్వ లక్ష్యమని, ఈ లక్ష్య సాధనలో యావత్ దేశ ప్రజలు భాగస్వాములు కావాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. రాజ్యాంగం దేశ ప్రజలకు అందించిన హక్కులు, బాధ్యతలను ప్రతిఒక్కరూ గుర్తుంచుకోవాలని సూచించారు. క్లిష్ట పరిస్థితుల్లోనూ భారత్ బలమైన ఆర్థిక వ్యవస్థగా నిలిచిందని కొనియాడారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం రాత్రి ఆమె జాతిని ఉద్దేశించి ప్రసంగించారు.

దేశ ప్రగతికి యువతే ఆధారమని, దేశ భవిష్యత్తుకు విద్యార్థులే నిజమైన రూపశిల్పులని అభివర్ణించారు. యువత భవిష్యత్తును కాపాడేందుకు భారత ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. పరీక్షా పత్రాల లీకేజీని అరికట్టేందుకు కేంద్రప్రభుత్వం కఠినమైన సంస్కరణలను చేపట్టిందని తెలిపారు. పరీక్షా విధానాన్ని మరింత పారదర్శకంగా మారుస్తోందని వివరించారు. పోటీ పరీక్షల వ్యవస్థను పారదర్శకంగా మారుస్తున్నదని పేర్కొన్నారు. సంస్కరణలతో యువతకు విద్యావ్యవస్థపై విశ్వాసం పెరుగుతుందని ఆకాంక్షించారు.

ఉగ్రవాదులు, వారి మద్దతుదారులు ఎక్కడ దాక్కున్నా, వారిని వదిలిపెట్టేది లేదని, వారు పర్యావసానాలు ఎదుర్కొనక తప్పదని ‘ఆపరేషన్ సిందూర్’ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. పాక్‌ఛా భారత్ మధ్య సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం దేశ ప్రయోజనాలను, ముఖ్యంగా రైతులను దృష్టిలో ఉంచుకొని తీసుకున్న నిర్ణయాత్మక చర్య అని అభివర్ణించారు. ‘జన గణ మన’కు సమానంగా భారత ప్రభుత్వం వందేమాతరం గీతానికి చట్టబద్ధత కల్పించిందని కొనియాడారు. 

వందేమాతర గీతం స్వతంత్ర పోరాటంలో కీలక పాత్ర పోషించిందని కీర్తించారు. ఎవరైనా గీతాన్ని ఆలపించకుండా అడ్డుకోవడం లేదా భంగం కలిగించడం శిక్షార్హమైన నేరమని పేర్కొన్నారు.  స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రతిఒక్కరూ దేశం కోసం ప్రాణాలర్పించిన స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకోవాలని పిలుపునిచ్చారు.

రాష్ట్రపతి ప్రసంగంలో ఈ సారి ఒక కీలక మార్పు చోటుచేసుకుంది. ప్రసంగానికి ముందు ఆమె ‘వందేమాతరం’ గీతం ఆరు చరణాల పూర్తి పాఠాన్ని ఆలపించారు. ప్రసంగం ముగిసిన తర్వాత జాతీయ గేయం ‘జన గణ మన’ సైతం ఆలపించారు. స్వాతంత్య్ర దినోత్సవ సందేశం వందేమాతరంతో ప్రారంభం కావడం ఇదే తొలిసారి.