రేపటి నుంచే ఇంటింటికీ ‘జనగణన’
బడంగ్‌పేట్‌లో ముగిసిన ముందస్తు ఏర్పాట్లు
సిబ్బందికి ఆర్డర్ కాపీలు, ఐడీ కార్డుల పంపిణీ
బడంగ్‌పేట్, మే 10 (విజయక్రాంతి): బడంగ్‌పేట్ మున్సిపల్ పరిధిలో జనగణన ప్రక్రియకు సర్వం సిద్ధమైంది. ఈ కార్యక్రమానికి సంబంధించి మున్సిపల్ కార్యాలయంలో డిప్యూటీ కమిషనర్ వి. సమ్మయ్య ఆధ్వర్యంలో సూపర్‌వైజర్లు, ఎన్యుమరేటర్లతో కీలక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ మాట్లాడుతూ.. సోమవారం మే 11నుంచి జనగణన ఫీల్ విధులు ప్రారంభం కానున్నాయని వెల్లడించారు. ఎన్యుమరేటర్లు ప్రతి ఇంటిని సందర్శించి, ప్రభుత్వం నిర్దేశించిన ఫార్మాట్ ప్రకారం ఖచ్చితమైన వివరాలను సేకరించాలని ఆదేశించారు.
ఈ ప్రక్రియను అత్యంత పారద ర్శకంగా, ఎలాంటి తప్పులు లేకుండా నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. జనగణన నిర్వహణకు సంబంధించి ఎన్యుమరేటర్ల తుది జాబితాను అధికారులు సిద్ధం చేశారు. ఈ కార్యక్రమంలో సూపర్‌వైజర్లు, ఎన్యుమరేటర్లకు మున్సిపల్ కార్యాలయం తరపున ఆర్డర్ కాపీలు, హెచ్.ఎల్.బి మ్యాప్స్, గుర్తింపు కార్డులను అందజేశారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా, మర్యాదపూర్వకంగా వివరాలు సేకరించాలని అధికారులు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో సెన్సస్ స్టాటిస్టికల్ ఆఫీసర్లు ఎండీ సాహిల్, విజయ్, శివ, సంబంధిత ఏఎంసీల అధికారులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.






