మహిళలు ఆర్థిక అభివృద్ధి సాధించాలి
ములకలపల్లి,(విజయక్రాంతి): మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ ఆర్థిక అభివృద్ధిని సాధించాలని మూకమామిడి సర్పంచ్ కొర్స ఆదిలక్ష్మి కోరారు. మూకమామిడి గ్రామపంచాయతీ మొగరాలగుప్ప గ్రామంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శనివారం మహిళా వారోత్సవాల ముగింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మూకమామిడి గ్రామపంచాయతీ సర్పంచ్ కోర్సా ఆదిలక్ష్మి పాల్గొని మహిళా సంఘాల సభ్యులతో కలసి భారీ ర్యాలీ నిర్వహించారు.
అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి సర్పంచ్ కోర్సా ఆదిలక్ష్మి మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని స్వయం సహాయక సంఘాల్లో చేరని మహిళలను సంఘాల్లో చేర్చాలని కిషోర బాలికలతో ప్రత్యేక సంఘాలను ఏర్పాటు చేసి వారికి సామాజిక, ఆర్థిక అంశాలపై పూర్తి అవగాహన కల్పించాలని సూచించారు. బాల్య వివాహాలను అరికట్టాలని బ్యాంకుల నుండి లింకేజీ అప్పులు తీసుకొని వడ్డీ లేని రాయితీ ప్రతి మహిళ పొందాలని మహిళలందరూ సంఘాలలో చేరి ఆర్థిక అభివృద్ధి పొందాలని అన్నారు.
ప్రతి ఒక్కరు చెట్లు పెంచి పర్యావరణాన్ని కాపాడాలని సూచించారు. ప్రకృతి వ్యవసాయం చేయాలని భూమిని రక్షించే బాధ్యత మనందరిపై ఉందన్నారు. అంతేకాకుండా మహిళా సంఘాల ప్రగతి,పొదుపు,బ్యాంకు రుణాలు,వడ్డీ రాయితీ పథకాల గురించి మహిళలకు వివరించారు. సంఘాల ద్వారా ఆర్థిక స్వావలంబన సాధించి కుటుంబానికి అండగా నిలవాలని సూచించారు.చేతిలో ప్లకార్డులతో మహిళలు గ్రామ వీధుల్లో ర్యాలీ నిర్వహించి మహిళా సాధికారత పై నినాదాలు చేశారు.
అనంతరం వెదురు సాగు లాభాలు,పెరటి కోళ్ళు పెంపకం, గొర్రెల పెంపకం,మొక్కలు పెంపకం భూసారాన్ని పెంచడం, వయోజన విద్య వంటి అంశాల మీద అవగాహన కల్పించి ర్యాలీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీసీ కే వెంకటేశ్వర్లు, వెదురు కన్సల్టెంట్ నిహారిక, వార్డు సభ్యులు కీసరి రాజ్ కుమార్, వివో అధ్యక్షురాలు కీసరి సుజాత పొదుపు సంఘాల మహిళలు,గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు.






