20 April, 2026 | 3:39 AM

నేడు పోరు గడ్డలకు పోరు బిడ్డలు

20-04-2026 01:59 AM

జగిత్యాలకు కేసీఆర్

కాళేశ్వరానికి రేవంత్

హీటెక్కనున్న రాజకీయం

కరీంనగర్, ఏప్రిల్19(విజయక్రాంతి): జైత్రయాత్రతో విప్లవ శంఖం పూరించిన జగిత్యాల కు మాజీ సి ఎం బి ఆర్ ఎస్ అధినేత కె సి ఆర్, తూర్పు అటవీ ప్రాంతంలో ఎర్రమల్లెలు పూయించిన ఒకప్పటి నక్సల్స్ కంచుకోట కాళేశ్వరం కు సి ఎం ఏనుమల రేవంత్ రెడ్డి లు సోమవారాం పర్యటిస్తుండటం రాజకీయుగ ప్రాధాన్యత సంతరించు కుంది. ఓ వైపున భానుడి భగభగలు... మరో వైపున రాజకీయ నాయకుల విమర్శనాస్త్రాలతో ఉమ్మడి జిల్లాలో హీట్ మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

తూర్పున ముఖ్యమంత్రి, పశ్చిమాన మాజీ ముఖ్యమంత్రులు బహిరంగ సభలకు హాజరవు తుండడం విశేషం.మాజీ మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్‌ఎస్ పార్టీలో చేరుతున్నారు. ఈ నెల 20న బీఆర్‌ఎస్ పార్టీ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తోంది. జగిత్యాలలోని వివేకానంద స్టేడియంలో నిర్వహించనున్న ఈ సమావేశానికి పెద్ద ఎత్తున జమీకరణ చేసే పనిలో నిమగ్నమైంది. ఈ సభ కోసం నియోజకవర్గాల వారిగా ఇంఛార్జీలను నియమించి మరీ విజయవంతం కోసం ప్లాన్ చేసింది.

ఈ సభ ద్వారా అధికార పార్టీని ఇరుకున పెట్టాలన్న యోచనలో గులాభి దళం ఉన్నట్టుగా స్పష్టం అవుతోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల తరువాత బీఆర్‌ఎస్ అధినేత ప్రజల్లోకి వచ్చిన సందర్భాలు తక్కువే. ఎన్నికల ప్రచారంలో భాగంగా కొన్నిప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సభల్లో పాల్గొన్నారు. పార్టీ నాయకులు ఎర్రవెల్లికి వెల్లి ఆయన ఆశీర్వాదాలు తీసుకున్న సందర్భాలే ఎక్కువ. తాజాగా జగిత్యాల సభకు కేసీఆర్ వస్తుండడం ప్రాధాన్యత సంతరించుకున్నట్టయింది.

కేసీఆర్ ప్రసంగించనున్న ఈ సభలో అధికార కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డిపై కేసీఆర్ నిప్పులు చెరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ వైఫల్యాలపై ఎండ గట్టే అవకాశాలు ఉన్నాయి. జీవన్ రెడ్డిని పార్టీలో జాయిన్ చేసుకుంటున్న ఈ వేదిక మీదుగానే బీఆర్‌ఎస్ పట్టు బిగించే విధంగా కె టి ఆర్  కార్యాచరణ రూపొందించి  జైత్ర యాత్ర గా నామకరణం చేశారు.ఇదే రోజున కేసీఆర్ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు వేదికగా గులాభి పార్టీని ఇరుకున పెట్టాలన్న లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. ఈ క్రమంలోనే ఈ నెల 20వ తేదిన మేడిగడ్డ టూర్ తో పాటు నస్తూరుపల్లి వద్ద భారీ బహిరంగ సభ నిర్వహిం చేందుకు హాజరు కానున్నారు.

కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం మేడిగడ్డ బ్యారేజ్ మరమ్మత్తులను పరిశీలించనున్నారు సీఎం. ఈ సందర్భంగా మేడిగడ్డ రిపేర్ల గురించి చర్చించడంతో పాటు పుష్కరాల సందర్భంగా జరుగుతున్న ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించనున్నట్టుగా అధికార వర్గాలు తెలిపాయ. అదే రోజున కాటారం, మహాదేవపూర్ మార్గ మధ్యలోని నస్తూరుపల్లి వద్ద భారీ బహిరంగ సభ లో ప్రసంగిస్తారు. ఈ మేరకు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు శనివారం జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యాల కారణాలతో పాటు పునరుద్దరణకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు వివరించనున్నట్టు సమాచారం. అలాగే బీఆర్‌ఎస్ పార్టీ అధినేత లక్ష్యంగా కూడా రేవంత్ రెడ్డి తన ప్రసంగం కొనసాగించనున్నట్టుగా తెలుస్తోంది. ప్రధానంగా బీఆర్‌ఎస్ ప్రయత్నాలను తిప్పికొట్టాలన్న సంకల్పంతో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారని, ఇందులో బాగంగానే నస్తూరుపల్లి వేదికను వినియోగించకోవాలని భావిస్తున్నట్టు సమాచారం.మొత్తానికి ఇద్దరు నేతలు ఒకే రోజు వస్తుండటం తో రాజకీయం వేడెక్కనుంది.