20 April, 2026 | 5:59 AM

మైదాన ప్రాంత గిరిజనులకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలి

20-04-2026 12:36 AM

రంగారెడ్డి, ఏప్రిల్ 19(విజయక్రాంతి) తెలంగాణలోని మైదాన ప్రాంత (నాన్ ఐటీడీఏ) గిరిజనులకు రాజకీయంగా సముచిత స్థానం కల్పించాలని గిరిజన సేవా సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు వంక్దవత్ హన్మా నాయక్ డిమాండ్ చేశారు. ఆదివారం న్యూఢిల్లీలో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ  ఎస్టి సెల్ జాతీయ చైర్మన్ రాజేంద్రపాల్ గౌతమ్ను కలిసి ఆయన వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా హన్మా నాయక్ మాట్లాడుతూ, తెలంగాణ గిరిజన రాజకీయాల్లో నెలకొన్న అసమానతలను చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రంలో ఉన్న 12 మంది గిరిజన ఎమ్మెల్యేలలో 11 మంది ఏజెన్సీ ప్రాంతాల వారే ఉన్నారని, దీనివల్ల మైదాన ప్రాంత గిరిజనులకు అన్యాయం జరుగుతోందని వివరించారు.  గిరిజన జనాభాలో 70 శాతం మంది మైదాన ప్రాంతాల్లోనే నివసిస్తున్నారని, రాబోయే డీ-లిమిటేషన్ ప్రక్రియలో వారికి తగినన్ని ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ సీట్లు కేటాయించాలని కోరారు. 

2027 జనాభా గణన అనంతరం జరిగే పునర్విభజనలో, మైదాన ప్రాంతాల్లో గిరిజనులు అధికంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి ఎస్టీ రిజరవ్డ్ నియోజకవర్గాలుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.దీనిపై సానుకూలంగా స్పందించిన రాజేంద్రపాల్ గౌతమ్, ఈ అంశాన్ని కాంగ్రెస్ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి మైదాన ప్రాంత గిరిజనులకు రాజకీయ గుర్తింపు దక్కేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు గిరిజన సంఘాల నాయకులు పాల్గొన్నారు.