11 May, 2026 | 4:21 PM

దళిత యువకుడి హత్య కేసును ఛేదించిన పోలీసులు

11-05-2026 02:55 PM

ముగ్గురు నిందితుల అరెస్ట్ 

టాటా జెస్ట్ కారు, మొబైల్ ఫోన్లు స్వాధీనం

గోదావరిఖని-2- టౌన్ పోలీసుల చాకచక్యంతో కేసు వేగంగా పరిష్కారం

గోదావరిఖని లో విలేకరుల సమావేశంలో ఏసీపీ రమేష్

గోదావరిఖని,(విజయక్రాంతి): రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో గోదావరిఖని-2- టౌన్ పోలీసులు దళిత యువకుడు జూల వంశీ హత్య కేసును వేగంగా ఛేదించి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు గోదావరిఖని ఏసీపీ  మడత రమేష్ సోమవారం గోదావరిఖని ఏసిపి కార్యాలయంలో  గోదావరిఖని-2- టౌన్ సీఐ ప్రసాద్‌రావుతో కలిసి నిందితుల అరెస్ట్ వివరాలను వెల్లడించారు.

ఏసీపీ పర్యవేక్షణలో గోదావరిఖని-II టౌన్ పోలీస్ స్టేషన్ పోలీసులు సమర్థవంతంగా దర్యాప్తు నిర్వహించి నిందితులను అదుపులోకి తీసుకున్నామని, ఈ కేసులో ఫిర్యాదుదారు సింగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన శ్రీమతి జూల శంకరమ్మ తన కుమారుడు జూల వంశీ (ఎస్‌సీ – మాదిగ) 29-04-2026 తేదీన ఇంటి నుండి వెళ్లి కనిపించకుండా పోయాడని 01-05-2026 న గోదావరిఖని-2- టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు మ్యాన్ మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారని, దర్యాప్తులో భాగంగా పోలీసులు సీడీఆర్, మొబైల్ కాల్ వివరాలను పరిశీలించగా A1 అలేఖ్య, A2 నీలం నవీన్, A3 బుర్ర భాస్కర్‌లపై అనుమానం వ్యక్తమైందని, వారిని అదుపులోకి తీసుకుని విచారించగా, ముగ్గురు కలిసి వంశీని హత్య చేసినట్లు ఒప్పుకున్నారని ఏసీపీ తెలిపారు.

వివరాల్లోకి వెళితే...మృతుడు జూల వంశీ A1- అలేఖ్య పదో తరగతి సమయంలో ప్రేమించుకున్నారని,  అనంతరం అలేఖ్య, A-2 నీలం నవీన్‌ను ప్రేమ వివాహం చేసుకుందని, అయితే 2025 ఫిబ్రవరిలో జరిగిన పదో తరగతి గెట్ టు గెదర్ కార్యక్రమం అనంతరం వంశీ, అలేఖ్య మొబైల్ నంబర్ తీసుకుని ప్రేమ పేరుతో తరచూ ఫోన్ కాల్స్, మెసేజ్‌లు చేస్తూ వేధింపులకు గురి చేశాడని,  అంతేకాకుండా వంశీ మూడు సార్లు అలేఖ్య ఫ్లాట్‌కు వెళ్లి గొడవలకు దిగగా, A2 నీలం నవీన్, A3 బుర్ర భాస్కర్ అక్కడికి చేరుకుని అతడిని మందలించి పంపించినట్లు విచారణలో వెల్లడైంది.

ఈ విషయాలను అలేఖ్య తన భర్త నవీన్ కు భాస్కర్‌ కు తెలియజేయడంతో ముగ్గురు కలిసి వంశీని హత్య చేయాలని కుట్ర పన్నారని, పథకం ప్రకారం అలేఖ్య, భాస్కర్ ఫోన్ చేసి వంశీని హైదరాబాద్‌కు రప్పించారని,  30-04-2026 తేదీన వంశీ ముందుగా అలేఖ్య ఫ్లాట్‌కు వెళ్లగా, అక్కడి నుండి ముగ్గురు కలిసి భాస్కర్‌కు చెందిన టాటా జెస్ట్ కారులో అతని ఫ్లాట్‌కు వెళ్లారని,  అదే సమయంలో నీలం నవీన్‌ పై అనుమానం రాకుండా ఉండేందుకు తాను డ్యూటీకి వెళ్తున్నానని చెప్పినట్లు విచారణలో వెల్లడైందని, తర్వాత భాస్కర్ తన ఫ్లాట్‌లో వంశీకి మద్యం తాగించి గొడవకు దిగాడని,  అనంతరం ముందుగానే సిద్ధం చేసుకున్న కత్తితో వంశీ ఛాతి, మెడ భాగాల్లో విచక్షణారహితంగా పొడవడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందినట్లు  తెలిపారు.

హత్య అనంతరం అలేఖ్య ఫోన్ ద్వారా నీలం నవీన్‌కు సమాచారం ఇవ్వగా, నవీన్ అక్కడికి చేరుకుని భాస్కర్‌తో కలిసి గదిలోని రక్తపు ఆనవాళ్లను లైజాల్‌తో శుభ్రం చేసినట్లు వెల్లడైందని, అనంతరం భాస్కర్, నవీన్ కలిసి మృతదేహాన్ని ప్లాస్టిక్ కవర్లు,  మ్యాట్‌లో చుట్టి కారులో ఉంచారని, తరువాత భాస్కర్ ఒక్కడే టాటా జెస్ట్ కారు నంబర్ TS-07-UH-6753లో మృతదేహాన్ని మంథని మండలం గాడుదులగండి ప్రాంతానికి తీసుకెళ్లి రోడ్డు పక్కనున్న లోయలో పడవేసినట్లు నిందితులు ఒప్పుకున్నారని ఏసీపీ తెలిపారు. నిందితుల వద్ద నుండి ఒక టాటా జెస్ట్ కారు,  ఐదు మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.