ఫైరింగ్ కేంద్రంలో పోలీసులకు ఫైరింగ్ ప్రాక్టీస్
బోధన్, ఆగస్టు 20 (విజయ క్రాంతి): విధుల్లో భాగంగా ఆయుధాలను సమర్థవంతంగా వినియోగించేందుకు పోలీసు సిబ్బంది నిరంతరం ఫైరింగ్ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ సూచించారు.గురువారం ఎడపల్లి మండల పోలీస్ స్టేషన్ పరిధిలోని జానకంపేట వద్ద గల పోలీస్ ఫైరింగ్ కేంద్రంలో జిల్లా పోలీసు సిబ్బందికి ఫైరింగ్ ప్రాక్టీస్ నిర్వహించారు. పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో సిబ్బందికి విధుల్లో వినియోగించే ఆయుధాలపై పూర్తి అవగాహన కల్పించడంతో పాటు వాటిని సురక్షితంగా, సమర్థవంతంగా వినియోగించేలా ప్రాక్టికల్ శిక్షణ అందించారు.
సిబ్బంది నిర్ణీత లక్ష్యాలపై ఫైరింగ్ నిర్వహిస్తూ లక్ష్యసాధన, ఖచ్చితత్వం, ఏకాగ్రత, ఆయుధాల వినియోగ నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. అత్యవసర పరిస్థితులు, నేరస్తులపై చర్యలు, శాంతిభద్రతల పరిరక్షణ వంటి సందర్భాల్లో పోలీసులు తక్షణమే స్పందించాల్సి ఉంటుందని, అందుకు నిరంతర ఫైరింగ్ ప్రాక్టీస్ ఎంతో అవసరమని సీపీ పేర్కొన్నారు. ఆయుధాలను వినియోగించే సమయంలో భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని, క్రమశిక్షణతో వ్యవహరించాలని సిబ్బందికి సూచించారు.
ప్రతి పోలీసు ఉద్యోగి తన ఫైరింగ్ నైపుణ్యాలను నిరంతరం మెరుగుపరుచుకుని విధి నిర్వహణలో మరింత సమర్థవంతంగా పనిచేసేలా సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ (అడ్మిన్) ఎన్. శుభం ప్రకాష్తో పాటు నిజామాబాద్, ఆర్మూర్, బోధన్, టాస్క్ఫోర్స్, సీటీసీ, ట్రాఫిక్, ఏఆర్, హోంగారడ్స్, ఐటీ విభాగాల ఏసీపీలు, సీఐలు, ఎస్హెచ్‌ఓలు, పీఎస్‌ఓలు తదితర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.






