సీత పాత్రలో నటించడం ఒక దైవిక బాధ్యత
‘నటీనటులకు ఇలాంటి పాత్రలు దక్కడం అంత సులువు కాదు, ఎందుకంటే ఒక దేవతా స్వరూపాన్ని తెరపై ఆవిష్కరించడం చాలా పెద్ద బాధ్యత’ అని తెలిపింది స్టార్ హీరోయిన్ సాయిపల్లవి. బాలీవుడ్ దర్శకుడు నితీశ్ తివారీ తెరకెక్కిస్తున్న ‘రామాయణ: పార్ట్ 1’ చిత్రంలో సాయిపల్లవి, సీతాదేవి పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. న్యూఢిల్లీలో ‘రామాయణ: ప్రథమ్ సంకల్ప్’ పేరుతో మేకర్స్ నిర్వహించిన ట్రైలర్ ప్రివ్యూ ప్రెస్మీట్‌లో ఎమోషనల్‌గా స్పందించింది సాయిపల్లవి. ‘ఈ ప్రతిష్టాత్మక ’రామాయణం’ సినిమాలో సీతమ్మ పాత్రను నేనేం వెతుక్కుంటూ వెళ్లలేదు, లేదా నేనే ఎంచుకోలేదు. ఆ సీతమ్మే నన్ను ఆశీర్వదించి, ఈ అద్భుతమైన పాత్ర పోషించే అదృష్టాన్ని నాకు ప్రసాదించిందని నేను బలంగా నమ్ముతున్నాను.
ఇది మనం వెంబడించి సంపాదించే సాధారణ పాత్ర కాదు. ‘నేను ఈ సీన్ ఇలా చేయాలి, అలా చేయాలి’ అని ఒక కాగితంపై రాసుకుని నటించే పాత్ర అసలే కాదు. అందుకే షూటింగ్ సమయంలో నేను కారవాన్‌లో లేదా సెట్లో ప్ర శాంతంగా కూర్చుని ధ్యానం చేసుకునేదాన్ని. మనస్ఫూర్తిగా దణ్ణం పెట్టుకుంటూ.. ’సీతమ్మ.. నన్ను కేవలం ఒక నటిగా కాకుండా నీ భక్తురాలిగా చూడు. నా ద్వారా నువ్వే ఈ పాత్రలో నటించు. నా నుంచి ఎలాంటి హావభావాలు, నటన రావాలో నువ్వే నిర్ణయించు’ అని ప్రతిరోజూ వేడుకునేదాన్ని.
కోట్లాది మంది భారతీయులు ఆరాధించే ఒక పవిత్రమైన పాత్రకు న్యాయం చేయాలనే తపనతో, ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యే వరకు కనీసం నా ఆలోచనలలోనైనా నన్ను నేను వీలైనంత స్వచ్ఛంగా, నిష్కల్మషంగా ఉంచుకోవడానికి నిరంతరం ప్రయత్నించాను. ఆ ప్రశాంతత, తటస్థత వల్లే నాలోని ఉత్తమ రూపాన్ని అక్కడ ప్రదర్శించగలిగానని భావిస్తున్నాను. ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో నేను ఒక నటిగా, వ్యక్తిగా చాలా విషయాలు నేర్చుకున్నాను. నేను ఈ సినిమా కోసం గత మూడు సంవత్సరాలుగా పని చేస్తుంటే, మా దర్శకుడు నితీశ్ తివారీ, నిర్మాత నమిత్ మల్హోత్రా అండ్ టీమ్ గత పదేళ్లుగా ఈ ప్రాజెక్ట్‌పై అహర్నిశలు శ్రమిస్తున్నారు.
దేవతా స్వరూపాలైన పాత్రలకు పూర్తి న్యాయం చేయడానికి చిత్రబృందం ఎంతో గుండెను, ఆత్మను పెట్టి పనిచేసింది. కాబట్టి ఈ రోజు (ప్రథమ్ సంకల్ప్ ఈవెంట్) మా అందరికీ చాలా మహత్వపూర్ణమైన రోజు. ప్రస్తుతం నేను అంతే ఉత్సాహంగా, అంతే వినయంగా ఉన్నాను. ఒకవేళ నా ప్రసంగంలో ఏమైనా తప్పుగా మాట్లాడి ఉంటే దయచేసి నన్ను క్షమించండి‘ అని సాయి పల్లవి భావోద్వేగంతో వినమ్రంగా ముగించారు.
ఈ ఈవెంట్‌లో సాయి పల్లవితో పాటు శ్రీరాముడిగా నటిస్తున్న రణబీర్ కపూర్, రావణాసురుడిగా నటిస్తున్న రాకింగ్ స్టార్ యష్, దర్శకుడు నితీశ్ తివారీ కూడా పాల్గొన్నారు. వేదికపై రణబీర్, సాయి పల్లవిలను పక్కపక్కన చూసిన దర్శకుడు నితీశ్ తివారీ మాట్లాడుతూ.. తనకు రణబీర్ కళ్లల్లో శ్రీరాముడు, సాయి పల్లవి కళ్లల్లో సీతమ్మే కనిపించారని ప్రశంసించారు.






