2 March, 2026 | 8:04 PM

క్రీడాకారులు గెలుపు ఓటములను సమానంగా స్వీకరించాలి

02-03-2026 06:28 PM

 హుజరాబాద్ ఏసిపి మాధవి

హుజురాబాద్,(విజయక్రాంతి): క్రీడాకారులు గెలుపు ఓటములను సమానంగా స్వీకరించాలని హుజురాబాద్ ఏసిపి వి మాధవి సూచించారు. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ పట్టణంలోని స్థానిక హైస్కూల్ క్రీడా మైదానంలో సోమవారం పి ఎం సంసద్ క్రీడా మహోత్సవంలో భాగంగా హుజురాబాద్ నియోజకవర్గ స్థాయి క్రీడలను స్థానిక భాజపా నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. క్రీడలు చదువుతోపాటు ఎంతో అవసరమని, పాఠశాల నుండి విద్యార్థులు క్రీడలపై శ్రద్ధ చూపించి రాష్ట్రస్థాయి, జాతీయస్థాయి క్రీడలో రాణించాలని కోరారు.

క్రీడల్లో రాణించిన వారికి ప్రత్యేక రిజర్వేషన్ కోటా ఉంటుందని రిజర్వేషన్ కోటతో ఉన్నత చదువులు,ఉద్యోగాలు, పొందవచ్చునని  తెలిపారు. దేశ ప్రధాని నరేంద్ర మోది నేతృత్వంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ క్రీడలను ప్రోత్సహించడం అభినందనీయమని అన్నారు. అనంతరం వివిధ పోటీలలో ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులను ప్రధానం చేశారు.

ఈ కార్యక్రమంలో బిజెపి పట్టణ అధ్యక్షుడు తూర్పాటి రాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి మాడా వెంకటరెడ్డి, అసెంబ్లీ ఇన్చార్జ్ క్రీడల కోఆర్డినేటర్ కనుమల్ల గణపతి, మోటపోతుల రాకేష్, జమ్మికుంట మాజీ మున్సిపల్ చైర్మన్ శీలం శ్రీనివాస్,  కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు నియోజకవర్గంలోని మండల అధ్యక్షులు పట్టణ అధ్యక్షులు, కార్యకర్తలు, క్రీడాకారులతోపాటు తదితరులు  పాల్గొన్నారు