12 June, 2026 | 3:44 AM

మడికట్టు వంతెన.. మృత్యుపాశం!

12-06-2026 12:03 AM

పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు.. 

ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని ప్రయాణిస్తున్న ప్రజలు

శంకర్ పల్లి, జూన్ 11 (విజయక్రాంతి): మండలంలోని సంకేపల్లి - అంతప్ప గూడ ప్రధాన రహదారిపై ఉన్న మడికట్టు వాగు వంతెన పూర్తిగా శిథిలావస్థకు చేరి ప్రయాణికులకు ప్రాణసంకటంగా మారింది. సుమారు 30 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ వంతెనకు రక్షణ గోడలు (దిమ్మెలు) లేకపోవడంతో నిత్యం వందలాది మంది ప్రయాణికులు, ద్విచక్ర వాహనదారులు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని ప్రయాణించాల్సిన దుస్థితి ఏర్పడింది. ప్రమాదం పొంచి ఉందని కళ్లముందే కనిపిస్తున్నా రోడ్డు భవనాల శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటంపై స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

రాత్రి వేళల్లో ఎన్నో ప్రమాదాలు..

శంకర్ పల్లి - నవాబుపేట్ మండలాల మధ్య నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగించే ఈ వంతెన ప్రస్తుతం అత్యంత ప్రమాదకరంగా మారింది. వంతెనకు ఇరువైపులా రక్షణ గోడలు పూర్తిగా ధ్వంసమవడంతో, రాత్రి వేళల్లో ఈ దారి గుండా కొత్తగా వచ్చే వాహనదారులు వంతెన అంచులను గమనించలేక వాగులో పడిపోయే ప్రమాదం పొంచి ఉంది.

వరద ముప్పు.. గంటల తరబడి నిరీక్షణ

కొద్దిపాటి వర్షానికే మడికట్టు వాగు ఉధృతంగా ప్రవహిస్తూ వంతెనపై నుంచి నీరు వెళ్తోంది. దీంతో అసలు రోడ్డు ఎక్కడుందో తెలియక, వరద నీరు తగ్గే వరకు ప్రయాణికులు, వాహనదారులు గంటల తరబడి రోడ్డుపైనే వేచి చూడాల్సి వస్తోంది. ప్రతిరోజూ ఇదే దారి గుండా అధికారులు, ప్రజాప్రతినిధులు వెళ్తున్నా ఎవరూ స్పందించడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ముందు ఓట్ల కోసం హామీలు గుప్పించే నాయకులు, గెలిచాక సమస్యను గాలికొదిలేశారని స్థానికులు మండిపడుతున్నారు.

తక్షణమే పునర్నిర్మించాలి

‘వంతెన పరిస్థితి దారుణంగా తయారైంది. ఎంతోమంది బైక్ లపై నుంచి కింద పడి ప్రమాదాలకు గురవుతున్నారు. అధికారులకు, నాయకులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోయింది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి వెంటనే ఇక్కడ కొత్త బ్రిడ్జి నిర్మించి మా ప్రాణాలను కాపాడాలి.

 కొండ పెంటయ్య (అంతప్ప గూడ)