ఏసీబీ వలలో పంచాయతీ కార్యదర్శి
రూ. 30 వేలు డిమాండ్ చేస్తూ రెడ్ హ్యాండెడ్గా దొరికిన కార్యదర్శి శరత్
తలకొండపల్లి, మే 5 (విజయక్రాంతి): అవినీతి రహిత సమాజం కోసం అధికారులు ఎంత ప్రయత్నిస్తున్నా, కొందరు అధికారులు మాత్రం లంచాల రుచి మరిగి అడ్డంగా దొరికిపోతున్నారు. ఇంటి రిజిస్ట్రేషన్ పేరు మార్పిడి కోసం లంచం డిమాండ్ చేసిన ఓ పంచాయతీ కార్యదర్శి, ఏసీబీ అధికారుల వ్యూహానికి చిక్కారు.
రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం వెల్జాల్ గ్రామ పంచాయతీలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన ఇంటి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల ఆధారంగా పంచాయతీ రికార్డులలో పేరు మార్పిడి (మ్యుటేషన్ ) చేయించుకోవడానికి కార్యదర్శి శరత్ ను సంప్రదించారు. అయితే, ఈ పని చేయడానికి కార్యదర్శి రూ. 30,000 లంచం డిమాండ్ చేశారు.
పక్కా వ్యూహంతో పట్టుకున్న ఏసీబీ..
బాధితుడు గత కొన్ని నెలలుగా కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా, కార్యదర్శి పని చేయకుండా ఇబ్బందులకు గురిచేశారు. దీంతో విసిగిపోయిన బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. అధికారుల సూచన మేరకు, మంగళవారం అడ్వాన్స్ కింద రూ. 20,000 నగదును కార్యదర్శికి అందజేస్తుండగా ఏసీబీ బృందం మెరుపు దాడి చేసింది. వెల్జాల్ గ్రామ పంచాయతీలో సర్పంచ్ ఆధ్వర్యంలో గ్రామసభ జరుగుతుండగా అధికారులు నిఘా పెట్టారు.
సభ ముగిసిన వెంటనే డబ్బులు తీసుకుంటున్న శరత్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.నిందితుడు శరత్ నుంచి లంచం సొమ్మును స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు, అతడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి, నిందితుడిని కోర్టులో హాజరుపరచనున్నట్లు అధికారులు వెల్లడించారు. అవినీతికి పాల్పడే అధికారుల సమాచారాన్ని వెంటనే తమకు తెలియజేయాలని ఈ సందర్భంగా ఏసీబీ వారు కోరారు.






