08-02-2026 12:27:43 AM
ఇంటింటి ప్రచారంలో ముందడుగు
పాల్వంచ 47వ వార్డు సీపీఐ అభ్యర్థి జీవీఆర్ ప్రచార జోరు
పాల్వంచ, ఫిబ్రవరి 7(విజయక్రాంతి): గత 27 ఏళ్లుగా స్థానిక సమస్యలతో సతమతమవుతున్న 47 వ డివిజన్ ప్రజానీకానికి స్థానిక సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తానని తెలుగుదేశం బలపరిచిన సీపీఐ అభ్యర్థి గుర్రం వెంకటేశ్వర్లు (జీవీఆర్) హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం డివిజన్ పరిధిలో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. గత 27 ఏళ్లుగా పాలకవర్గం లేక పాల్వంచ పట్టణ వాసులు అనేక సమస్యలను ఎదుర్కొన్నారని, స్థానిక ఎమ్మెల్యే సాంబశివరావు చొరవతో కార్పొరేషన్ గా అభివృద్ధి చెంది ఎన్నికలకు శ్రీకారం చుట్టామన్నారు.
స్థానిక సమస్యల పరిష్కారం కావాలన్నా, డివిజన్ పరిధిలో అభివృద్ధి జరగాలన్న కంకి కొడవలే గుర్తుకే అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని ఆయన ఓటర్లను కోరారు. ప్రధానంగా అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజీ వ్యవస్థను పునర్ నిర్మాణం, వీధి దీపాలు ఏర్పాటు చేయడం, అర్హులైన నిరుపేదలకు వితంతు, వృద్ధాప్య, దివ్యాంగులకు ఆసరా పెన్షన్లు అందజేయడం, పాత పాల్వంచలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. ఓటర్లు ఆయనకు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రచారంలో గుమ్మడవెల్లి శ్రీనివాస్, గోపాల్ పాల్గొన్నారు.