18 May, 2026 | 2:27 AM

తాటి ముంజలు ప్రకృతి వరం

18-05-2026 12:20 AM

ఘట్‌కేసర్, మే 17 (విజయక్రాంతి) : వేసవి మండే ఎండలనే కాదు మధురమైన పానీయాలను మన ముంగిటికి తెస్తుంది. ఎండాకాలంలో మధురమైన రుచులు అనగానే మనకు మొదట గుర్తుకు వచ్చేది మామిడి, అట్లాగే మండు వేసవిలో ఓయాసిస్ వలె అందుబాటులో ఉండేవి తాటి ముంజలు. ఎండవేడిని తట్టుకోలేక కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్ లు, చెరుకురసం, పండ్లరసాలు ఎన్నో ఉన్నా నోరూరించే తాటిముంజలు మండువేసవిలో ఎంతటి దప్పికనైనా ఇట్టే తీరుస్తాయి. అంతేకాదు ఎక్కడ ఎలా ఉన్నా వాటిని తినగలగడం వాటికి ఉన్న మరో ప్రత్యేకత. సహజ సిద్దమైన తియ్యటి నీరు మృదువైన గుజ్జుతో కూడి ఉండే తాటిముంజల్లో ఎన్నో సుగుణాలు ఉన్నాయి.

ఎండాకాలంలో అరచేతులు, కాళ్ల మంటలు, ఒంట్లో నీరు తగ్గిపోవడం, దప్పిక వేయడం తదితర సమస్యలతో బాధపడే వారు తగు మోతాదులో ముంజల్ని తీసుకుంటే ఫలితం ఉంటుంది. మండుతున్న ఎండలలో చల్లటి తాటి ముంజలు ప్రజలకు కాస్తంత ఉపశమనం ఇస్తూ ఉదరానికి చల్లదనం కలిగిస్తున్నాయి. పచ్చటి పొరతో తలతల మెరిసే ముంజలు ప్రకృతి ప్రసాదించిన వరం అంటే అతియెశక్తి కాదని డాక్టర్లు చెపుతున్నారు.

శీతల పానీయాలతో సమానంగా డిమాండ్ ఉన్న ముంజల వద్ద ప్రజలు గుంపులు గుంపులుగా చేరి బేరాలాడుతున్నారు. ఘట్ కేసర్ సర్కిల్ లోని పలు ప్రాంతాలలో ముంజల వ్యాపారం జోరుగా కొనసాగడంతో పాటు నగరానికి సైతం తరలించి వ్యాపారం చేస్తున్నారు. నగర శివారు మండలాల్లో తాటివనాలు నరికివేతకు గురవుతుండగా కొన్ని చెట్లను కల్లు కోసం ప్రత్యేకించడం తదితర కారణాలవల్ల తాటి ముంజల ధరలు అధిక మొత్తంలో విక్రయిస్తున్నారని ప్రకృతి ప్రసాదించిన తాటి ముంజలకు సాటి ఇతర పానీయాలు, పండ్లు లేవని చెప్పవచ్చు.