వరి కొనుగోలు ఏర్పాట్లు పక్కాగా చేయాలి
కలెక్టర్ బాదావత్ సంతోష్
నాగర్కర్నూల్, ఏప్రిల్ 17 (విజయక్రాంతి): జిల్లాలో రాబోయే రబీ సీజన్కు వరి కొనుగోలు ఏర్పాట్లు పక్కాగా చేయాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి అలసత్వం లేదా నిర్లక్ష్యం చోటుచేసుకున్నా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రబీ 202526 సీజన్కు సంబంధించి ధాన్యం కొనుగోలు ఏర్పాట్లపై శుక్రవారం ఐడీఓసీ భవనంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు.
జిల్లాలో సుమారు 1.87 లక్షల ఎకరాల్లో వరి సాగు జరిగి, 1.20 లక్షల మంది రైతుల నుంచి 4.44 లక్షల మెట్రిక్ టన్నుల వరి దిగుబడి వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు.రైతులకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరతో పాటు అదనంగా క్వింటాల్కు 500 ప్రోత్సాహకం చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు త్రాగునీరు, నీడ, కూర్చునే ఏర్పాట్లు చేయడంతో పాటు ధాన్యం తరలింపుకు తగిన లారీలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.






