వరి సాగు తగ్గించి ఆరుతడి పంటలు సాగు చేయాలి
చివ్వెంల, ఆగస్టు 5: ఎల్ నేను ప్రభావంతో ఈసారి వర్షాలు తక్కువగా పడి భూగర్భ జలాలు పడిపోయినందున ఈ వానాకాలం సీజన్ లో వరిసాగును తగ్గించి ఆరుతడి పంటల సాగును పెంచాలని జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి అన్నారు. మండలం గుంజలూరు గ్రామంలో జిల్లా వ్యవసాయ అధికారి జి. శ్రీధర్ రెడ్డి కంది, కూరగాయల పంటలను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత వాతావరణ పరిస్థితులు, నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని రైతులు వరి సాగు విస్తీర్ణాన్ని తగ్గించి కంది, పెసర, మినుములు, జొన్నలు, చిరుధాన్యాలు, కూరగాయల వంటి ఆరుతడి పంటలను సాగు చేయాలని సూచించారు. రైతులు తమ వద్ద ఉన్న నీటి వనరులకు అనుగుణంగా పంటల ప్రణాళిక రూపొందించుకుని, నీటి కొరత తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యాన శాఖ అధికారి నాగయ్య, మండల వ్యవసాయ అధికారి డి. వెంకటేశ్వర్లు, మండల తహసీల్దార్ చంద్రశేఖర్, వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు, రెవెన్యూ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.






