మన ఊరు – మన బాధ్యత.. పచ్చదనం కోసం గ్రామస్థుల స్వచ్ఛంద బాట
నేరేడుచర్ల,ఆగస్టు26(విజయ క్రాంతి ): పర్యావరణ పరిరక్షణతో పాటు తమ గ్రామాన్ని పచ్చదనంతో నింపాలనే సంకల్పంతో నేరేడుచర్ల మండలం గంటవారిగూడెం గ్రామస్థులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. సుమారు రూ.40 వేల సొంత నిధులతో అశోక మొక్కలను కొనుగోలు చేసి, గంటవారిగూడెం నుంచి సోమారం ఆర్‌అండ్‌బీ రోడ్డు వైపు సుమారు కిలోమీటరు మేర రహదారి వెంట మొక్కలు నాటారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు కొణతం చిన్న వెంకట్‌రెడ్డి పాల్గొని మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. గ్రామస్థులు స్వచ్ఛందంగా సొంత నిధులు సమకూర్చుకుని పచ్చదనం కోసం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో వల్లంచెట్ల లచ్చయ్య, జ్యోతిబాబు, బచ్చలకూరి ప్రకాశ్, తాళ్ల సురేష్‌రెడ్డి, తొట శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.






