17 August, 2026 | 4:36 PM

కేంద్ర ప్రభుత్వ రైతాంగ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకించండి

17-08-2026 03:17 PM

దమ్మపేట, ఆగష్టు 17 (విజయక్రాంతి): సంయుక్త కిసాన్ మోర్చా జాతీయ కమిటీ పిలుపు భాగంగా అశ్వారావుపేట శాసనసభ్యులు జారే ఆదినారాయణకు సంయుక్త కిసాన్ మోర్చా నాయకులు అమర్లపూడి రాము, దొడ్డ లక్ష్మీనారాయణ, సుంకి పాక ధర్మ, గోకినపల్లి ప్రభాకర్, మోరంపూడి శ్రీనివాసరావుల ఆధ్వర్యంలో మెమోరాండం సమర్పించారు.

ఈ సందర్బంగా సంయుక్త కిసాన్ మోర్చా నాయకులు మాట్లాడుతూ ఢిల్లీ సరిహద్దుల్లో జరిగిన చారిత్రాత్మక రైతు పోరాటం సందర్భంగా, 2021 డిసెంబర్ 9న కేంద్ర ప్రభుత్వం ఎంఎస్పి, రుణమాఫీ, విద్యుత్ ప్రైవేటీకరణ, రైతులపై కేసుల ఉపసంహరణపై ఇచ్చిన లిఖితపూర్వక హామీని అమలు చేయకపోవడంపై వీరు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం వ్యక్తం చేశారు.

ఢిల్లీ సరిహద్దుల్లో 385 రోజుల పాటు కొనసాగిన నిరంతర భారీ మహాపడావ్ పోరాటం రేయింబవళ్లు శాంతియుత ఉద్యమం జరిగిందన్నారు. ఆ ఉద్యమంలో 736 మంది అమరులయ్యారని, అమరవీరుల ప్రాణత్యాగం నేపథ్యంలో 2020 నవంబర్ లో ఏర్పడినప్పటి నుండి, అన్ని పంటలకు సేకరణతో కూడిన చట్టబద్ధమైన ఎంఎస్పి, గ్రామీణ రుణభారాన్ని, తత్ఫలితంగా జరుగుతున్న రైతులు, దినసరి కూలీల విస్తృత ఆత్మహత్యలను అంతం చేసేందుకు సమగ్ర రుణమాఫీ, మరియు విద్యుత్ ప్రైవేటీకరణను అడ్డుకోవడం అనే ప్రధాన డిమాండ్లను సాధించేందుకు ఎస్ కెఎం పోరాట మార్గంలో అలుపెరగకుండా ఉద్యమం కొనసాగిందన్నారు.

స్వాతంత్య్రానంతరం జరిగిన అతి పెద్ద ప్రజా పోరాటమైన, శ్రామిక వర్గ ఉద్యమం నిర్వ్యా జన మద్దతుతో సాగిన ఈ రైతు పోరాటం 2021 నవంబర్ 19న 3 వ్యవసాయ చట్టాల రద్దును సాధించిందన్నారు. 2021 డిసెంబర్ 9 నాటి లిఖితపూర్వక హామీతో డిసెంబర్ 11న పోరాటాన్ని విరమించారని, అయితే, గత ఐదేళ్లలో ఎన్డీఏ నేతృత్వంలోని మోదీ ప్రభుత్వం ఏ హామీలను అమలు చేయలేదన్నారు. ఈ కార్యక్రమంలో  కల్లూరి కిషోర్, పండూరి వీరబాబు, చిరంజీవి, కురసం ముత్యాలరావు, చెన్నారావు, కేశవరావు, బండి ఆదినారాయణ, కేసరి వెంకటేష్, సోయం నాగేశ్వరావు, సోయం లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.