లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహణ చట్టరీత్యా నేరం
డీఎంహెచ్ఒ డాక్టర్ మధుసూదన్
కఠిన చర్యలు తప్పవని వెల్లడి
భూపాలపల్లి టౌన్, ఆగస్టు 17 (విజయక్రాంతి): గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం చట్టరీత్యా నేరమని జయశంకర్ భూపాలపల్లి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మధుసూదన్ తెలిపారు. సోమవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో గర్భస్థ పిండ లింగ నిర్ధారణ నిరోధక చట్టం అమలుపై జిల్లా సలహా కమిటీ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఒ మాట్లాడుతూ స్కానింగ్ కేంద్రాల నిర్వాహకులు చట్ట నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే చట్ట ప్రకారం జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా విధించబడుతుందని హెచ్చరించారు. ప్రతి స్కానింగ్ కేంద్రంలో స్కానింగ్ పరికరాలను నిర్వహిస్తున్న వైద్యుల పూర్తి వివరాలను నమోదు చేయాలని ఆదేశించారు.
అలాగే ప్రతి స్కానింగ్ కేంద్రంలో లింగ నిర్ధారణకు వ్యతిరేకంగా తీసుకుంటున్న చర్యలు, చట్టపరమైన నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించేలా ఫ్లెక్సీలు, పోస్టర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. వైద్యుల వివరాలు, స్కానింగ్‌కు సంబంధించిన రుసుముల వివరాలను ప్రజలకు స్పష్టంగా కనిపించే విధంగా గోడలపై ప్రదర్శించాలని సూచించారు. ప్రతి గర్భిణికి నిర్వహించిన స్కానింగ్‌కు సంబంధించిన పూర్తి వివరాలను రికార్డుల్లో నమోదు చేయడంతో పాటు స్కానింగ్ చేయించుకున్న గర్భిణి సంతకం తప్పనిసరిగా తీసుకోవాలని తెలిపారు.
ప్రైవేట్ ఆసుపత్రులు, స్కానింగ్ కేంద్రాల నిర్వాహకులు గర్భిణులు, వారి కుటుంబ సభ్యులకు లింగ నిర్ధారణ చట్టంపై అవగాహన కల్పించాలని డీఎంహెచ్‌ఓ సూచించారు. ఈ సమావేశంలో పీఒ ఎంసీహెచ్ డాక్టర్ శ్రీదేవి, డిప్యూటీ సివిల్ సర్జన్ డాక్టర్ దేవేందర్, పీడియాట్రిషన్ డాక్టర్ సుధాకర్, గైనకాలజిస్ట్ డాక్టర్ సంధ్య, ఎన్జీఓ ప్రతినిధి శ్యాంప్రసాద్, డెమో శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.






