23 May, 2026 | 3:40 PM

ఆన్‌లైన్ ఓటుచోరీ!

20-09-2025 12:11 AM

కేంద్ర ఎన్నికల కమిషన్‌పై కాంగ్రెస్ ఎంపీ, లోకసభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ మరోసారి ఆగ్రహం వెళ్లగక్కడం రాజకీయంగా వేడిని పెంచింది. సరిగ్గా నెలరోజుల క్రితం ఎన్నికల సంఘం ఓట్ల చోరీకి పాల్పడిందంటూ ఆరోపించిన రాహుల్ గాంధీ.. తాజాగా ఎన్నికల సంఘంపై తన దాడిని మరింత తీవ్రం చేశారు. గురువారం ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో మాట్లాడిన రాహుల్ గాంధీ ఈసారి నేరుగా ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్‌కుమార్‌పై దాడికి దిగడం గమనార్హం.

ఓట్ల దొంగలకు ఆయన అండగా ఉన్నారని.. ప్రజాస్వామ్య వినాశకులను కాపాడుతున్నారని ఆరోపించడం గమనార్హం. బయటి రాష్ట్రాల ఫోన్లను ఉపయోగించి అలంద్‌లో 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆగంతకులు 6,018 ఓట్లను తొలగిస్తే, అదే విధానంలో మహారాష్ట్రలోని రజోరా నియోజకవర్గంలో 6,850 మంది కొత్త ఓటర్లను చేర్చారని వెల్లడించారు.

అయితే అలంద్‌లో చూసుకున్నా, రజోరా నియోజకవర్గంలో చూసుకున్నా ఓట్ల తొలగింపునకు సాధారణ ఓటర్ల పేరుతో దరఖాస్తులు వచ్చాయని, కానీ వాస్తవంగా ఆ దరఖాస్తులను అందులో పేర్లున్నవారు చేయలేదని, ఆటోమేటిక్ సాఫ్ట్‌వేర్ ఉపయోగించి దరఖాస్తులు చేసి కాంగ్రెస్ సానుభూతిపరుల ఓట్లను తొలగించారు. తమ పార్టీ అనుకూల పోలింగ్ కేంద్రాల పరిధిలో ఓటర్లను ఆన్‌లైన్‌లో తొలగించే ప్రయత్నం జరిగిందని రాహుల్ తెలిపారు.

కర్ణాటకలోని మహదేవ్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో లక్షకు పైగా ఓట్లు గల్లంతవ్వడం, ఒకే ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారని చూపించడం, డూప్లికేట్ ఓటర్లను సృష్టించారని, అధికార బీజేపీతో కేంద్ర ఎన్నికల సంఘం కుమ్మక్కైందంటూ గతంలోనూ రాహుల్ ఈసీని తూర్పారబట్టారు. అయితే కేంద్ర ఎన్నికల సంఘం రాహుల్ ఆరోపణలను ఎప్పటికప్పుడూ కొట్టిపారేస్తూ వచ్చింది.

తాజాగా ఆన్‌లైన్‌లో ఓట్ల చోరీ జరిగిందంటూ రాహుల్ చేసిన ఆరోపణలు కొట్టిపారేసిన ఎన్నికల సంఘం.. ఆన్‌లైన్ ద్వారా ఎవరంటే వాళ్లు ఏ ఒక్క ఓటరును తొలగించలేరని పేర్కొంది. సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌పై రాహుల్ చేసిన ఆరోపణలు అవాస్తవమని, నిరాధారమని తోసిపుచ్చింది. అయితే వాదన వినిపించుకునే అవకాశం బాధిత వ్యక్తికి ఇవ్వకుండా ఓటు తొలగించే అవకాశం ఉండదని ఈసీ స్పష్టం చేసింది.

రాహుల్ చేసిన ఆరోపణలకు సరైన ఆధారాలు చూపెట్టాలని లేదంటే బేషరతుగా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఈసీ డిమాండ్ చేసిన సంగతి కూడా తెలిసిందే. తాము ఏ పార్టీకి కొమ్ము కాయడం లేదని ఎన్నికల సంఘం పదే పదే చెబుతున్నప్పటికీ రాహుల్ మాత్రం ఈసీపై తన ఆరోపణలను మాత్రం ఆపడం లేదు. పైగా తన వద్ద ఆధారాలు ఉన్నాయంటూ పేర్కొనడం చూస్తే ఎన్నికల సంఘం పారదర్శకతను, విశ్వసనీయతను కోల్పోతుందా అన్న అనుమానం కలుగుతోంది.

1950 జనవరి 26న భారత్ గణతంత్ర దేశంగా అవతరించిన తర్వాత ఎన్నోసార్లు పార్లమెంట్ సహా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించిన ఘనత ఈసీ సొంతం. బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చాకా మాత్రం ఎన్నికల సంఘంపై ఆరోపణలు ఎక్కువైపోయాయి. అయితే రాజ్యాంగ బద్ధ సంస్థ అయిన ఎన్నికల సంఘం పార్టీలకు అతీతంగా పారదర్శకంగా పనిచేస్తూ ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.