14 April, 2026 | 1:42 AM

మక్కల కొనుగోళ్లకు పాత ‘గన్నీ’ పరేషానీ!

14-04-2026 12:03 AM

షార్టేజీ కొర్రీలు పెడుతున్న మార్క్ ఫెడ్ 

మహబూబాబాద్, ఏప్రిల్ 13 (విజయక్రాంతి): మార్క్ ఫెడ్ సంస్థ మక్కల కొనుగోళ్లకు పాత గన్నీ సంచులను వినియోగిస్తుండటంతో కంటా వేసి, ఎగుమతి చేయడానికి లారీల్లోకి ఎత్తుతున్న సమయంలో చిల్లులు పడ్డ బస్తాల నుంచి మక్కలు రాలిపోతున్నాయి. దీనితో దిగుమతి చేసుకుంటున్న సందర్భంగా తరుగు వస్తుండడంతో రైతులకు నగదు చెల్లింపుల్లో కోత పడే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.

మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా 18 చోట్ల మార్క్ఫెడ్ ద్వారా మక్కల కొనుగోలు నిర్వహిస్తున్నారు. ప్రైవేట్ ట్రేడర్లు క్వింటాలుకు గరిష్టంగా మక్కలకు 1,700 నుంచి 1,900 వరకు మాత్రమే ధర పడుకున్నారు. ఈ క్రమంలో రైతులు మక్కలను మార్క్ ఫెడ్ సంస్థ ద్వారా విక్రయించి క్వింటాలుకు 2,400 రూపాయల ధర పొందేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీనితో జిల్లావ్యాప్తంగా వీలాది మంది రైతులు యాసంగి సీజన్లో తాము పండించిన లక్షల బస్తాల మక్కలను మార్క్ఫెడ్ కొనుగోలు కేంద్రాలకు తీసుకువస్తున్నారు. 

 పాత గన్నీ సంచులతో కొనుగోళ్లు

మార్క్ ఫెడ్ సంస్థ మక్కల కొనుగోళ్లకు పాత గన్నీ సంచులను వినియోగిస్తుండటంతో రైతులకు ఇబ్బందిగా మారింది. పూర్తిగా పాత గన్నీ సంచులను కొనుగోలు కేంద్రాలకు కేటాయించింది. కొనుగోలు కేంద్రాలకు మొక్కలను తెచ్చిన వేలాది మంది రైతులు మార్క్ఫెడ్ కొనుగోలు కేంద్రాల నిర్వహకులు ఇచ్చిన పాత గన్ని సంచులనే అదృష్టంగా భావిస్తూ వాటిలో మక్కలను నింపి కాంటా వేస్తున్నారు.

కొనుగోలు కేంద్రాల వద్ద రైతుల రద్దీ పెరగడంతో ఇచ్చిన బస్తాల్లోనే మక్కలను నింపాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే చిల్లులు పడ్డ బస్తాలకు తిప్పలు పడి కాంట నిర్వహించిన తర్వాత ఎగుమతి సమయంలో లారీల్లోకి హమాలీలు చేరవేస్తుండగా చిరుగులు పడ్డ చాలా బస్తాల్లో నుండి మక్కలు కారిపోతున్నాయి. దీనితో దిగుమతి సమయంలో గోదాముకు చేరిన తరువాత వే బ్రిడ్జీ కంటా తూకంలో తేడా వస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.

కేసముద్రం వ్యవసాయ మార్కెట్ లో రైతుల నుండి కొనుగోలు చేసిన మక్కలను ఇప్పటివరకు 80 లారీల మక్కలను గోదాముకు తరలించగా ఐదు లారీలకు 50 చొప్పున తరుగు (షార్టేజీ) వచ్చినట్లు చెబుతున్నారు. దీనితో ఆ లారీల్లో రైతులకు డబ్బుల చెల్లింపుల్లో కోత విధించే పరిస్థితి నెలకొంది. ఈ విధంగా రైతుకు పాత గన్ని సంచుల వల్ల 1,200 రూపాయలు నష్టం వచ్చే పరిస్థితి ఏర్పడుతోంది. 

మేలైన గన్నీ సంచులు ఇవ్వాలి

పాత గన్నీ సంచుల వల్ల కాంటా వేయడంలో, ఎగుమతి చేయడంలో చిరిగిపోయి మక్కలు కింద పడిపోతున్నాయి. వాటిని తిరిగి శుభ్రం చేసి ఎత్తడం కష్టంగా మారుతుంది. ఇప్పటికే రోజుల తరబడి మార్కెట్లో పడిగాపులు పడుతున్నాం. మళ్లీ తీరా లారీ లోడ్ చేసే సమయంలో బస్తాలు చిరిగిపోవడం వల్ల వాటిని సరిచేసి తూకం వేయించడానికి ఇబ్బంది కలుగుతోంది. అధికారులు స్పందించి మేలైన కొత్త గన్ని సంచులను ఇవ్వాలి.

విజయ్, రైతు, ఆలేరు

మంచి సంచుల్లోనే మక్కలు నింపాలి

రైతులకు మార్క్ ఫెడ్ సంస్థ ద్వారా ఇచ్చిన గన్నీ సంచుల్లో మంచిగా ఉన్న వాటిలోనే మక్కలు నింపి తూకం వేయించాలి. మార్క్ ఫెడ్ సంస్థ పాత గన్నీ సంచులను పంపింది. దీనితో ఉన్న వాటిలో సరిచూసుకుని వినియోగించాలి. లారీలోకి మక్కలు లోడ్ అయ్యేంత వరకు జాగ్రత్తగా చూసుకోవాలి. లేదంటే దిగుమతి సమయంలో తరుగు వస్తే రైతులకు చెల్లించే డబ్బుల్లో కోత పడుతుంది. ఇప్పటికే గోదాములో దిగుమతి చేసిన ఐదు లారీలకు షార్టేజీ వచ్చింది.

మల్లారెడ్డి, సొసైటీ సీఈవో