6 August, 2026 | 2:46 AM

వన్డే ప్రపంచకప్ క్వాలిఫైయర్స్ షెడ్యూల్ ఖరారు

06-08-2026 12:00 AM

దుబాయి, ఆగస్టు 5: వచ్చే ఏడాది జరిగే వన్డే ప్రపంచకప్ క్వాలిఫైయర్ షెడ్యూల్ ఖరారైంది. ఫిబ్రవరి 22 నుంచి మార్చి 23 వరకు మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఐసీసీ టోర్నీ తేదీలను ఖరారు చేసినప్పటికీ, వేదికను ఇంకా నిర్ణయించలేదు. మొత్తం 10 జట్లు ఈ క్వాలిఫైయర్‌లో తలపడనున్నాయి. ఈసారి క్వాలిఫికేషన్ విధానంలో కీలక మార్పులు చేశారు.

10 జట్లు క్వాలిఫైయర్‌లో తలపడనుండగా, ఛాంపియన్‌గా నిలిచే జట్టు 2027 వరల్డ్‌కప్‌కు అర్హత సాధిస్తుంది. 2, 3, 4 స్థానాల్లో నిలిచే జట్లు కొత్తగా ప్రవేశపెట్టిన సూపర్ సిరీస్ దశకు చేరుకుంటాయి. సూపర్ సిరీస్‌లో విజేతకు ప్రపంచకప్ ప్రధాన దశలో మిగిలిన ఒక బెర్త్ దక్కుతుంది. 10 జట్లలో 2 జట్లు 2026 సెప్టెంబర్ 30 నాటికి వన్డే ర్యాంకింగ్స్‌లో దిగువన ఉండే ఫుల్ మెంబర్ జట్లు. ఆతిథ్య దేశాలైన దక్షిణాఫ్రికా, జింబాబ్వే మినహాయింపు దక్కింది.

క్రికెట్ వరల్డ్‌కప్ లీగ్ 2లో టాప్-4 జట్లు, మిగతా 4 జట్లు వరల్డ్‌కప్ క్వాలిఫయర్ ప్లేఆప్స్‌లో టాప్-4 జట్లు నిలిచినవి. ఇదిలా ఉంటే ప్రధాన జట్లలో వెస్టిండీస్ పరిస్ఖితి ఆసక్తికరంగా మారింది. కరేబియన్ జట్టు నేరుగా వరల్డ్‌కప్‌కు అర్హత సాధించడం అనుమానంగానే కనిపిస్తోంది. ప్రస్తుతం వన్డే ర్యాంకింగ్స్‌లో 10వ స్థానంలో ఉన్న విండీస్ సెప్టెంబర్ 30 కటాఫ్ తేదీకి ముందు భారత్‌తో రెండు మ్యాచ్‌లు ఆడనుంది. ఆ రెండు మ్యాచ్‌ల ఫలితాలు, అలాగే ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ ఫలితాలు వారి ప్రపంచకప్ అవకాశాలను నిర్ణయించనున్నాయి.కాగా 2027వన్డే ప్రపంచకప్ అక్టోబర్ 4 నుంచి నవంబర్ 21 వరకు దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా వేదికలుగా జరగనుంది.